‘బిహార్ బరి’లో కులమే బలం!
న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కుల సమీకరణాలు చక్రం తిప్పుతున్నాయి. ఎన్డీఏ కూటమి, జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌ల మహాకూటమి ప్రకటించిన అభ్యర్థుల వివరాలను చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఎన్డీఏ కూటమి ప్రకటించిన 214 సీట్లలో 86 సీట్లను అగ్రవర్ణాలకు కేటాయించగా మహాకూటమి కేవలం యాదవులకే 63 సీట్లను కేటాయించింది. తద్వారా రాష్ట్రంలో సంఖ్యాపరంగా 12-14 శాతంగా ఉన్న యాదవుల మద్దతు తమకే కొనసాగేలా చూస్తోంది.
ఆర్జేడీ 101 సీట్లలో 48 సీట్లను యాదవులకే కేటాయించింది. మరోవైపు రాష్ట్ర జనాభాలో 14 శాతం మించని అగ్రవర్ణాలకు ఎన్డీఏ ఇప్పటివరకూ 40 శాతం సీట్లు కేటాయించింది. యాదవులకు 22 సీట్లు కేటాయించింది. ముస్లింలకు రెండు కూటములు ప్రాధాన్యం ఇవ్వకపోవడం గమనార్హం. ఆర్జేడీ, జేడీయూలు ముస్లింలకు 23 టికెట్లు కేటాయించగా ఎన్డీఏ 9 సీట్లిచ్చింది. కాంగ్రెస్ 41 సీట్లలో 10 సీట్లను ముస్లింలకు ఇచ్చింది.