
నడుములోతు నీళ్లు.. కదలని కాళ్లు!
ఎటు చూసినా నడుములోతు నీళ్లు. ఎటూ కదల్లేని పరిస్థితి. అడుగు తీసి అడుగు వేయాలన్న నడుములోతు నీళ్లలో నానా కష్టాలు పడాల్సిన దుస్థితి. గుడిసెలు కూలాయి. పాకలు నేలమట్టమయ్యాయి. పూరిళ్లు ధ్వంసమయ్యాయి. సామాన్యుడి గూడు చెదిరింది. గుండె చెరువైంది. ఇది బిహార్‌లోని దర్భాంగ జిల్లాలోని పరిస్థితి. భారీ వర్షాలు, వరదలు ముంచెత్తడంతో జిల్లాలోని చాలా గ్రామాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇళ్లు, స్కూళ్లు, వీధులు, ఊర్లు నీటమునిగాయి.
ప్రజల పరిస్థితి దుర్భరంగా మారింది. ఊర్లకు ఊర్లు నీటమునగడంతో చాలామంది చిన్నచిన్న తెప్పల సాయంతో ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నడుములోతు నీళ్లలో ఎటు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. అక్కడి ఫొటోలు, అక్కడి నుంచి అందుతున్న సమాచారం ఆందోళన కలిగిస్తున్నది. ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు.
రాజోరి జిల్లాలోనూ..
జమ్ముకశ్మీర్‌లోని రాజోరి జిల్లాలోనూ భారీ వర్షాలు విలయతాండవం చేశాయి. ఇక్కడ నదులు ప్రమాదస్థాయిని దాటి పొంగి ప్రవహిస్తుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.