కిలకిలలు విలవిల
సాక్షి, విజయవాడ బ్యూరో: అరకల వెనకాల పురుగులను పట్టుకోవడానికి కొంగల ఆపసోపాలు. చీడ పీడలను తిని రైతులకు మేలు చేసే గోరింకలు. మావి చిగురుతిని కమ్మగా కూసే కోయిలలు, పెరిటి జామ చెట్టుమీద రామచిలుకలు. వరి కుచ్చులపై వాలే పిచ్చుకలు.. ఇవన్నీ రాజధాని ప్రాంతంలో గత స్మృతులుగానే మిగలనున్నాయి. రాజధాని ప్రాంతంలోని వేలాది ఎకరాల్లో వేసే పంటలపై ఆధారపడి జీవించే ఆ జీవజాలానికి ఇప్పుడు పెనుముప్పు వచ్చిపడింది. కార్తెలు మారుతున్నా పొలాల్లో పనులు ఎందుకు లేవో ఆ మూగ జీవాలకు తెలియక.. ఎటు పోవాలో అర్థంకాక తల్లడిల్లుతున్నాయి.
ఆ ఇంద్రుడే ‘చంద్రుడి’ రూపంలో వచ్చి అమరావతిని నేలకు తీసుకువస్తాడని మనుషుల భాషలో నేతలు చేస్తున్న ప్రచారం పాపం ఆ పక్షులకు ఏమి అర్థమవుతుంది. కానీ, ప్రకృతికి విరుద్ధంగా నడుస్తూ తమ ప్రాణాలకే ఎసరు పెట్టబోతున్నారని అర్థం చేసుకున్న ఆ పక్షుల్లో కొన్ని వలసబాటపట్టగా.. మరికొన్ని ఏం చేయాలో అర్థంకాక బిక్కచూపులు చూస్తున్నాయి. రాజధాని ప్రాంతంలో ప్రకృతి సమతుల్యత పూర్తిగా దెబ్బతిని, ఆహార గొలుసు తెగిపోవడంతో జీవజాతులు ఆకలితో అలమటించి‘పోతున్నాయి’.
వ్యవ‘సాయం’పైనే
రాజధాని ప్రాంతంలో 26 రకాల పక్షులు తరతరాలుగా ఆవాసం ఉంటున్నాయి. ఇక్కడి గ్రామాల్లో పలురకాలైన కూరగాయలతో పాటు పండ్లతోటలే వాటికి వడ్డించిన విస్తళ్లుగా ఉండేవి. కృష్ణా నదీ పరివాహక గ్రామాలైన వెంకటపాలెం, తాళ్లాయపాలెం, లింగాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం, బోరుపాలెం, రాయపూడి గ్రామాలకు సమీపంలోని గుబురు చెట్లల్లో గూళ్లు పెట్టుకుని తమ సంతతి వృద్ధి చేసుకునేవి. పత్తి పంటకు మేలు చేసే పోలీసు పిట్ట (డ్రాంగో), పాలపిట్టలు, పిచ్చుకలు, కముజు పిట్టలు, తీతువుపిట్టలు, చెకుముకి పిట్టలు ఎక్కడబడితే అక్కడ కనబడేవి. ఇప్పుడు వాటి జాడలేక ప్రకృతి ప్రేమికులు కలత చెందుతున్నారు. పచ్చదనం తగ్గిపోతుండటంతో వాతావరణంలో వేడి పెరిగి పోతోంది. ఈ ప్రభావం పలు రకాల పక్షలపై పడుతోంది. అదృష్టం తెస్తుందని భావించే పాలపిట్ట (బ్లూ జే) కానరాని దూరాలకు ఎగిపోతోంది. పావురాళ్లతో పాటు పంట పొలాల్లో కనిపించే తెల్లకొంగలు, బురకలు కూడా మాయమవుతున్నాయి.