‘పాలమూరు’పై ఇష్టారాజ్యం
సర్కార్‌పై బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ధ్వజం
అధికారంలో ఉన్న వారెక్కడైనా బంద్ చేస్తారా అని ప్రశ్న
పుష్కరాల బస్సుచార్జీల పెంపుపై నేడు నిరసనలు
హైదరాబాద్: పాలమూరు ఎత్తిపోతల పథకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షం గా వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పాలమూరు ప్రాజెక్టుల డిజైన్లమార్పు, శంకుస్థాపన, బంద్ వంటి విషయా ల్లో ఇటు టీఆర్‌ఎస్ నేతలు, అటు ముఖ్యమం త్రి కేసీఆర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని వద్దని కేంద్ర ప్రభుత్వం అన్నదా అని ప్రశ్నించారు. ఏపీ సీఎం చంద్రబాబు ఉత్తరాలు రాసుకుంటే కేంద్రం తగిన సమాధానం ఇస్తుందన్నారు. దీనిపై అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ బంద్ చేపట్టడం ఏమిటని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ఉత్తరాలు రాయడం బాబుకు అలవాటని, ఇలాంటి ఉత్తరాలు చాలా రాసుకున్నారన్నారు. రాష్ట్రంలో చాలా ప్రాజెక్టులు పెండింగులో ఉన్నాయని, వాటిని పూర్తిచేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని ప్రాజెక్టులపై శాసనసభలో సమగ్రంగా ఎందుకు చర్చించడం లేదని ప్రశ్నించారు. అలాగే మున్సిపల్ కార్మికుల సమ్మెను ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. దీనివల్ల చెత్త పేరుకుపోయి హైదరాబాద్ దుర్గంధంతో నిండిపోయిందన్నారు. సీఎం జోక్యం చేసుకుని వెంటనే పారిశుద్ధ్య కార్మికులు, నేతలతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని సూచించారు. కాగా, పుష్కరాల కోసం ఆర్టీసీ బస్సుల్లో అదనంగా 50 శాతం చార్జీలు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం రాష్ట్రంలోని అన్ని బస్టాండ్ల వద్ద నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు వెల్లడించారు.
22న అమిత్‌షా రాక
తెలంగాణ రాష్ట్రం వచ్చాక జరుగుతున్న తొలి పుష్కరాల్లో పాల్గొనడానికి ఈ నెల 22న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా వస్తున్నట్టుగా కిషన్‌రెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తిలో అమిత్‌షా పుష్కర స్నానం ఆచరించే అవకాశాలున్నాయని వివరించారు. 15న ధర్మపురిలో కేంద్రమంత్రి దత్తాత్రేయ, 19న కేంద్రమంత్రి హన్స్‌రాజ్ బాసరలో పుష్క ర స్నానాలు చేయనున్నట్టు చెప్పారు.