సామాన్యుల కష్టాలన్నీ తీరుస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: విద్యుత్ చార్జీలు 30 శాతం తగ్గింపు, కూరగాయల ధరల నియంత్రణ, సబ్సిడీపై అదనపు గ్యాస్‌ి సలిండర్లు, ఢిల్లీకి పూర్తి రాష్ట్రస్థాయి హోదా వంటి హామీలతో సామాన్యులను ఆకట్టుకునేలా ఢి ల్లీ విధానసభ ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ విడుదల చేసింది. పార్టీ ఢిల్లీ ప్రదేశ్ కార్యాలయంలో మంగళవారం మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్‌తో పాటు పార్టీ ఢి ల్లీ సీఎం అభ్యర్థి డాక్టర్ హర్షవర్ధన్, నగరశాఖ అధ్యక్షుడు విజయ్ గోయల్, విజయేంద్ర గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీ వాసుల నుంచి సేకరించిన అభిప్రాయాలు ప్రతిబింబించేలా, వారి కష్టాలు తీర్చేలా మేనిఫెస్టోను రూపొందించినట్టు డాక్టర్ హర్షవర్ధన్ వివరించారు.
మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు:
ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లోపే పూర్తిస్థాయి రాష్ట్రహోదా కల్పనకు కృషి
నిత్యావసరాలు, కూరగాయల ధరలు తగ్గించేందుకు చర్యలు
ప్రతి ఇంటిపై సోలార్ విద్యుత్ ఉత్పాదక వ్యవస్థ ఏర్పాటు ద్వారా ఢిల్లీని విద్యుత్ కొరత లేని రాష్ట్రంగా మార్చడం
ప్రస్తుతం సబ్సిడీపై ఇస్తున్న తొమ్మిది సిలిండర్లకు అదనంగా మరో మూడు పంపిణీ
‘ఎసెన్షియల్ డ్రగ్ పాలసీ’ అమలులో భాగంగా అత్యవసరమైన 25 రకాల మందులను ఢిల్లీవాసులందరికీ ఉచితంగా అందుబాటులోకి తేవడం. ఢిల్లీలోని అన్ని జిల్లాల్లో ట్రామా కేంద్రాల ఏర్పాటు
మోనో రైలును అందుబాటులోకి తేవడం, మెట్రో రైలును అన్ని ప్రాంతాలకు విస్తరింపజేయడం.