న్యూఢిల్లీ: ఢిల్లీలో ఈసారి త్రిశంకు సభ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిసెంబర్ 4న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ దక్కే అవకాశాలు లేవని ఇప్పటికే పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ‘హ్యాట్రిక్’ సీఎం షీలా దీక్షిత్ ఇన్నింగ్స్ ఇక ముగిసినట్లేనని, ఢిల్లీ అసెంబ్లీలో కాంగ్రెస్ అధికారానికి కాలం చెల్లినట్లేనని ఈ సర్వేలు తేల్చి చెబుతున్నాయి. ఇదివరకటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీల నడుమనే ప్రధానంగా పోటీ ఉండేది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) ఈ ఎన్నికల్లో రంగంలోకి దిగడంతో త్రిముఖ పోటీ అనివార్యంగా మారింది. వరుసగా మూడుసార్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు ఈసారి ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల కారణంగా ఆధిక్యత సన్నగిల్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అయితే, ఈ పరిస్థితిని సానుకూలంగా మలచుకోవడంలో ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ విఫలమైనట్లే కనిపిస్తోంది. షీలా దీక్షిత్‌కు దీటైన అభ్యర్థిని అన్వేషించడంలో నెలల తరబడి తాత్సారం చేసిన బీజేపీ, ఎట్టకేలకు ఆదరాబాదరాగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన హర్షవర్ధన్‌ను తన సీఎం అభ్యర్థిగా బుధవారం తెరపైకి తెచ్చింది.
బీజేపీ ఢిల్లీ నగర శాఖ అధ్యక్షుడు విజయ్ గోయల్ సీఎం అభ్యర్థిత్వంపై చాలా కాలంగా ఆశలు పెట్టుకున్నారు. పార్టీ పదవుల్లో తన మనుషులకే ప్రాధాన్యమిస్తున్నారంటూ ఆయనపై ఫిర్యాదులు రావడంతో, బీజేపీ నాయకత్వం ఆయనను కాదని హర్షవర్ధన్‌ను తెరపైకి తెచ్చింది. హర్షవర్ధన్‌ను సీఎం అభ్యర్థిగా తెరపైకి తేవడంతో గోయల్ తెరవెనుక అసమ్మతి కార్యకలాపాలకు పాల్పడే అవకాశాలు లేకపోలేదని, ఈ పరిస్థితిని చక్కదిద్దడం హర్షవర్ధన్‌కు అగ్నిపరీక్షేనని బీజేపీ ఢిల్లీ నేతలే చెబుతున్నారు.
ప్రభుత్వ వ్యతిరేకత కాంగ్రెస్ విజయావకాశాలను మసకబార్చే సూచనలు కనిపిస్తుండగా, ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ ఈ పరిస్థితిని పూర్తిగా సొమ్ము చేసుకోలేని స్థితిలో ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఢిల్లీలో తాజాగా కిలో రూ.90కి చేరిన ఉల్లి ధరలు అధికార కాంగ్రెస్‌కు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. ఉల్లి ధరలపై బెంబేలెత్తిన ఢిల్లీ సీఎం షీలా దీక్షిత్, గురువారం కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్, ఆహార మంత్రి కేవీ థామస్‌లతో ఈ అంశంపై మాట్లాడనున్నారు. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఏఏపీ ప్రభావవంతమైన శక్తిగా ఆవిర్భవించింది. కాంగ్రెస్, బీజేపీలకు దీటుగా ఢిల్లీ అసెంబ్లీలోని మొత్తం 70 స్థానాలకూ ఏఏపీ కూడా తన అభ్యర్థులను రంగంలోకి దించుతోంది. త్రిశంకు ఫలితాలు వస్తే, ఏఏపీ ‘కింగ్ మేకర్’ పాత్ర పోషించగలదని విశ్లేషకుల అంచనా. యూపీఏ భాగస్వామ్య పక్షమైన ఎన్సీపీ, యూపీఏకు బయటి నుంచి మద్దతు ఇస్తున్న బీఎస్పీ కూడా మొత్తం 70 స్థానాల నుంచి అభ్యర్థులను పోటీకి నిలుపుతున్నాయి. సీపీఎం, శిరోమణి అకాలీదళ్, లోక్ జనశక్తిబ వంటి పలు పార్టీలు పరిమిత స్థానాల నుంచి పోటీ చేస్తున్నా, వాటి ప్రభావం అంతంతే. కేంద్రంలోని యూపీఏ సర్కారు వరుస అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోవడం, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో వైఫల్యం వంటి అంశాల కారణంగా గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేసిన వారిలో పలువురు బీజేపీ లేదా ఏఏపీ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి.