షిండేతో బొత్స భేటిలో ఆంతర్యమేమిటి!
కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం)తో కాంగ్రెస్ పార్టీ సమావేశానికి ముందే కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేతో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సమావేశమవ్వడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
జీవోఎం సమావేశానికి వెళ్లే కాంగ్రెస్ పార్టీ సభ్యుల్లో బొత్స ఒకరు కాకపోగా, షిండేతో 20 నిమిషాలపాటు భేటి కావడం మీడియాలో చర్చనీయాంశమైంది. వాస్తవానికి జీవోఎం సమావేశానికి కాంగ్రెస్ తరపున మంత్రి వట్టి వసంతకుమార్, డిప్యూటి ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహలు బుధవారం సాయంత్రం సమావేశంకానున్నారు. ఈ నేపథ్యంలో షిండేను కలువడం అనేక సందేహాలకు తావిస్తోంది.
రాష్ట్ర విభజనపై పలు పార్టీలతో జరుగుతున్న కీలక జీవోఎం సమావేశానికి ముందు షిండేతో బొత్స సమావేశం కొంత వివాదానికి తెర తీసింది. ఇదే విషయంపై బొత్సను మీడియా అడిగితే.. 'హోం మంత్రి షిండే రమ్మంటేనే ఢిల్లీ వచ్చాను', కాంగ్రెస్ నుంచి మంత్రి వట్టి వసంతకుమార్, దామోదర రాజనర్సింహ ఏం నివేదిక ఇస్తారో నాకు తెలియదు అని అన్నారు.