202 పాయింట్లు నష్టం | BSE Sensex, Nifty flat; Coal India slips 9%, TCS falls 3% | Sakshi
Sakshi News home page

202 పాయింట్లు నష్టం

Published Sat, Jan 18 2014 1:45 AM | Last Updated on Sat, Sep 2 2017 2:43 AM

202 పాయింట్లు నష్టం

202 పాయింట్లు నష్టం

ప్రధాన ఐటీ షేర్లు టీసీఎస్, విప్రోల్లో లాభాల స్వీకరణ జరగడంతోపాటు బ్యాంకింగ్, రియల్టీ షేర్లలో అమ్మకాల కారణంగా శుక్రవారం స్టాక్ సూచీలు క్షీణించాయి. 202 పాయింట్లు కోల్పోయిన బీఎస్‌ఈ సెన్సెక్స్ చివరకు 21,063 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ నష్టాన్ని మినహాయించినా, గత ఐదురోజుల్లో సెన్సెక్స్ 305 పాయింట్లు పెరిగినట్లయ్యింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 57 పాయింట్ల తగ్గుదలతో 6,262 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.
 
 ఐటి దిగ్గజం టీసీఎస్ అంచనాల్ని మించిన ఆదాయం, లాభాల్ని ప్రకటించినా, ఆపరేటింగ్ మార్జిన్లు బలహీనంగా వుండటంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడ్డారని, ఇంకా ఫలితాలు వెల్లడించాల్సివున్న విప్రో, టెక్ మహీంద్రాల్లో సైతం విక్రయాలు జరిగినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. విప్రో, టెక్ మహీంద్రాలు క్యూ2 ఫలితాలు వెల్లడించిన అక్టోబర్ రెండోవారం నుంచి 15-20 శాతం మధ్య ర్యాలీ జరిపిన సంగతి తెలిసిందే. శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత విప్రో నికరలాభం 27% పెరిగిన ట్లు ప్రకటించింది. టీసీఎస్ 5 శాతం క్షీణించగా, విప్రో, టెక్ మహీంద్రాలు 2-4 శాతం మధ్య తగ్గాయి. ఐటీ షేర్లతో పాటు ఫైనాన్షియల్ షేర్లు ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలు 2-3 శాతం పడిపోయాయి. రియల్టీ షేర్లు డీఎల్‌ఎఫ్, జేపీ అసోసియేట్స్ 2-4 శాతం మధ్య తగ్గాయి. పెట్రో మార్కెటింగ్ షేర్లు ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌లు 3-6 శాతం మధ్య ర్యాలీ జరిపాయి.
 
 నిఫ్టీ ఫ్యూచర్లో లాంగ్ ఆఫ్‌లోడింగ్....
 వరుసగా రెండురోజులపాటు లాంగ్ బిల్డప్ జరిపిన బుల్స్ శుక్రవారం ఒక్కసారిగా వారి పొజిషన్లను ఆఫ్‌లోడ్ చేసినట్లు డెరివేటివ్ డేటా వెల్లడిస్తున్నది. నిఫ్టీ జనవరి 2 నాటి 6,358 పాయింట్ల గరిష్టస్థాయిని అధిగమించలేకపోవడంతో ఇన్వెస్టర్లు లాంగ్ పొజిషన్లను ఆన్‌వైండ్ చేసినట్లు బ్రోకింగ్ వర్గాలు చెపుతున్నాయి. తాజా బుల్ ఆఫ్‌లోడింగ్‌ను సూచిస్తూ స్పాట్‌తో పోలిస్తే ఫ్యూచర్ నిఫ్టీ ప్రీమియం పూర్తిగా హరించుకుపోయింది. డెరివేటివ్ సిరీస్ ముగింపునకు రెండు వారాల సమయం ఉండగానే నిఫ్టీ ఫ్యూచర్ ప్రీమియం కోల్పోవడం గత ఏడాదిగా ఇదే ప్రధమం. జనవరి ఫ్యూచర్ ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) నుంచి 10.41 లక్షల షేర్లు (5.47 శాతం) కట్‌కావడంతో మొత్తం ఓఐ 1.79 కోట్ల షేర్లకు దిగింది. 6,300 స్ట్రయిక్ వద్ద కాల్ రైటింగ్, పుట్ కవరింగ్ జరిగాయి. ఈ కాల్ ఆప్షన్లో 4.89 లక్షల షేర్లు యాడ్‌కాగా, పుట్ ఆప్షన్ నుంచి 10.53 లక్షల షేర్లు కట్ అయ్యాయి. అలాగే 6,200 పుట్ ఆప్షన్ నుంచి కూడా 9.58 లక్షల షేర్లు కట్ అయ్యాయి. 6,300 కాల్ ఆప్షన్లోనూ, 6,200 పుట్ ఆప్షన్లోనూ 55 లక్షల షేర్ల చొప్పున ఓఐ వుంది. సమీప భవిష్యత్తులో ఈ రెండు స్థాయిల్లో ఒకదానిని ఛేదించేవరకూ 100 పాయింట్ల శ్రేణిలో నిఫ్టీ కదలవచ్చని ఆప్షన్ డేటా సూచిస్తున్నది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement