
ఢిల్లీ శివార్లలో కాల్పులు.. తల్లీకొడుకుల హత్య
దేశ రాజధాని శివార్లలో ఘోరం జరిగింది. వ్యాపారంలో వచ్చిన గొడవలతో తన భాగస్వామి ఇంట్లోకి అర్ధరాత్రి ప్రవేశించిన ఓ వ్యక్తి.. అతడి భార్యను, చిన్న కొడుకును కాల్చి చంపాడు. వ్యాపారవేత్త అజయ్ ఖురానాను, అతడి పెద్దకొడుకును, ఇంట్లో పనిచేసే వ్యక్తిని కూడా నిందితుడు రాజేష్ జాలీ పొడిచేశాడు. వాళ్లు ముగ్గురినీ నోయిడా సెక్టార్ 28 లోని కైలాష్ ఆస్పత్రిలో చేర్చారు. నిందితుడికి కూడా తలమీద తీవ్రగాయాలు కావడంతో అతడిని కూడా ఆస్పత్రిలో చేర్చారు. అయితే అతడికి గాయాలు ఎలా అయ్యాయో మాత్రం పోలీసులు చెప్పలేకపోతున్నారు. వడ్డీ వ్యాపారం చేసే వీళ్లిద్దరి మధ్య ఆర్థిక విషయాల్లోనే గొడవ జరిగిందని అంటున్నారు.
రాత్రి 11 గంటలకు ఖురానా ఇంటికి వచ్చిన జాలీ.. ముందుగా ఖురానా భార్య అంజు, చిన్న కొడుకు అంకుశ్ (33)లను చంపేసిన తర్వాత పెద్దకొడుకు అమిత్ (38), ఇంట్లో పనిచేసే రాజులను కూడా పొడిచాడు. ముందుగా భోజనం చేస్తున్న అంకుశ్ మీద కాల్పులు జరిపాడు. తుపాకి మోత విని అంజు బయటకు రాగా ఆమెను కూడా కాల్చేశాడు. వాస్తవానికి ఖురానాను మాత్రమే చంపుదామని అతడు వచ్చాడని, కానీ అతడి మీద కాల్పులు జరిపినా తప్పించుకున్నాడని పోలీసులు అంటున్నారు. అంతలో ఖురానా పెద్దకొడుకు అమిత్ ఎలాగోలా జాలీని పట్టుకున్నాడు. అతడిని ఆపేందుకు తండ్రీకొడుకులు ప్రయత్నించినా, పదునైన ఆయుధంతో ఇద్దరినీ పలుమార్లు పొడిచేశాడు. తుపాకుల మోత విన్న ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు వచ్చిన పోలీసు బృందం జాలీని అదుపులోకి తీసుకుని అందరినీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకొచ్చేసరికే అంజు, అంకుశ్ మరణించారని, ఖురానా, అమిత్, రాజు ఐసీయూలో ఉన్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.