
ప్రభుత్వ వైద్య కాలేజీల్లో 10,000 ఎంబీబీఎస్ సీట్ల పెంపు
ప్రభుత్వ వైద్య కాలేజీల్లో సీట్ల పెంపునకు కేంద్రం పచ్చజెండా
సీట్ల పెంపు కోసం ప్రభుత్వ వైద్య కాలేజీలను కేంద్ర ప్రాయోజిత పథకంతో అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఇందుకోసం రూ.10 వేల కోట్లు వ్యయమవుతుంది.
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో వైద్యుల కొరతను అధిగమించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మరో 10 వేల ఎంబీబీఎస్ సీట్లను అందుబాటులోకి తెచ్చేందుకు పచ్చజెండా ఊపింది. సీట్ల పెంపు నిమిత్తం ప్రస్తుతమున్న రాష్ట్ర ప్రభుత్వ/కేంద్ర ప్రభుత్వ వైద్య కళాశాలలను అప్‌గ్రేడ్ చేయాలన్న ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ప్రతిపాదనకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) గురువారం ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదన కింద దేశంలోని రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లను పెంచడానికి ఆయా కాలేజీలను కేంద్ర ప్రాయోజిత పథకంతో అప్‌గ్రేడ్ చేస్తారు. సుమారు రూ.10 వేల కోట్ల వ్యయం కాగల ఈ పథకం అమలుతో దేశవ్యాప్తంగా దాదాపు 10 వేల సీట్లు పెరుగుతాయి. పథకం అమలుకు అయ్యే మొత్తం వ్యయాన్ని కేంద్రం, రాష్ట్రాలు ఉమ్మడిగా భరిస్తాయి.
మొత్తంగా చూస్తే ఈ పథకం కోసం కేంద్రం రూ.7,500 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని, రాష్ట్రాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాలు మిగతా రూ.2,500 కోట్ల వ్యయాన్ని భరిస్తాయని ఆరోగ్య మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. పథకం అమలుకు అయ్యే వ్యయాన్ని భరించే విషయంలో రాష్ట్రాల కేటగిరీలవారీగా వ్యత్యాసముంది. ఈశాన్య రాష్ట్రాలు, ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాల్లో ఈ పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు 90:10 నిష్పత్తిలో నిధులను ఖర్చు చేస్తాయి. ఇతర రాష్ట్రాల విషయానికొస్తే కేంద్రం, రాష్ట్రాలు 70:30 నిష్పత్తిలో ఖర్చును భరిస్తాయి.
మొత్తమ్మీద చూస్తే దాదాపు 10,000 ఎంబీబీఎస్ సీట్లు పెరగనున్నందున ఒక్కో సీటు కోసం సగటున రూ.1.20 కోట్లు ఖర్చు చేయనున్నారు. దేశంలో ప్రస్తుతం 381 మెడికల్ కాలేజీలు ఉండగా అందులో 49,918 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. కేంద్రం నిర్ణయంతో డాక్టర్-పేషెంట్ నిష్పత్తి ప్రస్తుతమున్న 1:2000 నుంచి 1:1000కు తగ్గనుంది. రాష్ట్రాల్లో మరో 58 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతోపాటు జిల్లా ఆస్పత్రుల అప్‌గ్రెడేషన్‌కు కేంద్రం గత వారం ఆమోదం తెలపడం తెలిసిందే. దీనివల్ల మరో 5,800 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి.