
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్ల కోటా అమలుకు అవసరమైన ప్రతిపాదనలను పంపాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖను ఆదేశించింది. ఈ నెల ఆరో తేదీలోగా ప్రతిపాదనలు పంపాలని కోరింది. ఈడబ్ల్యూఎస్ కోటాను ఈ వైద్య విద్యా సంవత్సరం ఎంబీబీఎస్ సీట్ల భర్తీలోనూ అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం అమలు చేయాలంటే 25 శాతం ఎంబీబీఎస్ సీట్లను పెంచాల్సి ఉంటుందని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
రిజర్వేషన్ల స్ఫూర్తి దెబ్బతినకుండా కోటా
నీట్ రాసి ఫలితాలకోసం ఎదురుచూస్తున్న అగ్రవర్ణ పేద విద్యార్థులకు ఈడబ్ల్యూఎస్‌తో ఎంతో ప్రయోజనం కలగనుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య భారీగా పెరగగా, మరో 387 సీట్లు కూడా వాటికి తోడు కానున్నాయి. ఈ రిజర్వేషన్లు కల్పించాలంటే సీట్ల సంఖ్య పెంపు తప్పనిసరి. జనరల్ కోటా సీట్లు తగ్గకుండా రిజర్వేషన్లు కల్పించాల్సి ఉంది. ప్రస్తుతం ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1,550 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. అందులో పదిశాతం సీట్లు అంటే 155 సీట్లు పెంచితే సరిపోతుంది అనుకుంటాం.
కానీ మొత్తం సీట్ల సంఖ్యలో బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు పాటించాలన్న మరో నిబంధన ఉంది. లెక్క ప్రకారం 49 శాతం సీట్లు ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్‌లోకి వెళ్లాలి. ఇలాగాకుండా ఈడబ్ల్యూఎస్‌కు 10 శాతం సీట్లు వదిలేసి, మిగతా 90 శాతం సీట్లలో 49 శాతం సీట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వ్ చేస్తే వారికి సీట్లు తగ్గుతాయి. ఇది రిజర్వేషన్ల స్ఫూర్తికి విరుద్ధం. రిజర్వేషన్ల స్ఫూర్తిని కొనసాగిస్తూనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తింపజేయాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment