నటిపై అత్యాచారం: ఇండస్ట్రిపై డైరెక్టర్ మండిపాటు
ప్రముఖ నటి కిడ్నాప్, అత్యాచార ఘటన నేపథ్యంలో సినీ పరిశ్రమ తీరుపై ప్రముఖ మలయాళ దర్శకుడు సనల్ కుమార్ శశిధరన్ మండిపడ్డారు. సినీ పరిశ్రమ పితృస్వామ్య భావజాలాన్ని తలకెత్తుకొని హీరోయిజాన్ని హైలెట్ చేసినంతకాలం బాధితురాలైన నటికి నిజమైన మద్దతు దొరకబోదని ఆయన పేర్కొన్నారు.
కిడ్నాప్, లైంగిక వేధింపుల ఘటన నేపథ్యంలో బాధితురాలైన నటికి సంఘీభావం తెలుపుతూ మలయాళ చిత్రపరిశ్రమ ఆదివారం మూకుమ్మడిగా నిరసన ప్రదర్శన నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సనల్‌కుమార్ స్పందిస్తూ.. '99శాతం మన సినిమాలు హీరోయిజాన్ని గొప్పగా చూపిస్తాయి. మన ప్రేమకథలు, ఫ్యామిలీ డ్రామాలు, ఆఖరికీ కాలేజీ సినిమాలు కూడా పితృస్వామ్యాన్ని సమర్థిస్తూ చూపిస్తాయి. ఇందులో చాలావరకు మహిళ వ్యతిరేక భావజాలం ఉంటుంది. ఈ క్రమంలో బాధితురాలైన నటికి నిజమైన మద్దతు లభిస్తుందనుకోవడం మూర్ఖత్వమే' అని ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు.
'ఇప్పటికైనా ఈ హీరోలు తమ హీరోయిజం డాంబికాలను తగ్గించుకుంటారా' అని ఆయన ప్రశ్నించారు. కేరళ రాష్ట్ర అవార్డు గ్రహీత అయిన సనల్‌కుమార్.. 'ఒళివుడివసథె కాలి, సెక్సీ దుర్గ వంటి అసాధారమైన చిత్రాలను రూపొందించారు. తన సినిమాల్లో పితృస్వామ్య పోకడలను ప్రశ్నించారు.