నిజమైన హీరో అంటే ఈ తాతయ్యనే!
65 ఏళ్ల అవతార్ హోతి, ఆయన కొడుకు పాల్ ఎప్పటిలాగే తమ పంటపొలంలో పనిచేసకుంటున్నారు. వీరి పొలానికి పక్కనే నార్త్ తాంప్సన్ నది కాలువ ఉంది. చలికాలం కావడంతో చల్లటి నీటితో నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఇంతలోనే ఓ 14 ఏళ్ల అమ్మాయి అరుపులు-కేకలు వినిపించాయి. నదిలో కొట్టుకుపోతూ ఆమె సాయం కోసం అర్థించింది. వెంటనే అవతార్, పాల్ నది దగ్గరకు వెళ్లి చూశారు.
కెరటాల్లో కొట్టుకుపోతూ బాధితురాలు కేకలు వేస్తోంది. పాల్‌కు ఏం చేయాలో తోచలేదు. కానీ చురుగ్గా ఆలోచించిన హోతి మాత్రం వెంటనే తలపాగా తీసి.. సాయంగా బాధితురాలి కోసం విసిరాడు. ఆమె దానిని అందుకొని సురక్షితంగా బయటపడింది. నదిలో కొట్టుకుపోతున్న షాక్‌లో ఉన్న ఆమెకు తండ్రీకొడుకులు ప్రథమ చికిత్స చేసి ప్రాణాలు నిలిపారు. భారత సంతతికి చెందిన 65 ఏళ్ల హోతిని ఇప్పుడు కెనడాలో అందరూ నిజమైన హీరో అని పొగుడుతున్నారు. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా రాష్ట్రం కేమ్‌లూప్స్‌లో ఉంటున్న ఆయన చేసిన సాహసాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు.
నదిలో కొట్టుకుపోతున్న అమ్మాయికి తలపాగాను తాడులా అందించి.. ఒడ్డుకు తీసుకురావడమే కాదు.. చలినీటిలో గడ్డకట్టుకుపోయిన ఆమె కోలుకునేలా తండ్రీ-కొడుకులు సపర్యలు చేశారు. షాక్ నుంచి తేరుకున్న తర్వాత బాధితురాలిని తమ కారులో సమీపంలోని ఆమె బామ్మ ఇంట్లో వదిలిపెట్టి వచ్చామని పాల్ తెలిపాడు. సమయస్ఫూర్తితో తన తండ్రి చేసిన సాహసం తనకు గర్వకారణంగా ఉందని అతను సీబీసీ న్యూస్‌కు తెలిపాడు.