'అందరినీ సంతృప్తి పరచలేం'
న్యూఢిల్లీ: ఒకే ర్యాంకు, ఒకే పెన్షన్ నోటిఫికేషన్ పై వెల్లడైన అభ్యంతరాలపై రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ స్పందించారు. అందరినీ సంతృప్తిపరచడం సాధ్యం కాదని ఆయన వ్యాఖ్యానించారు. పథకం అమల్లో తలెత్తే సమస్యల పరిష్కారానికి జ్యుడిషియల్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ఆయన తెలిపారు.
'ప్రధాన అంశాలన్నింటినీ నోటిఫికేషన్ లో చేర్చాం. ఇంకా ఏవైనా సమస్యలుంటే కమిషన్ పరిష్కరిస్తుంది. ప్రజాస్వామ్యంలో డిమాండ్ చేసే హక్కు అందరికీ ఉంది. ప్రధాన డిమాండ్లను నెరవేర్చాం. ప్రతి ఒక్కరినీ సంతృప్తిపరచడం సాధ్యం కాదు' అని పారికర్ అన్నారు.
సైనికులు 40 ఏళ్లుగా ఎదురు చూస్తున్న 'ఒక ర్యాంకు-ఒక పెన్షన్' పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం ఈనెల 7న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం ఒకే ర్యాంకులో పనిచేసి గతంలో రిటైరైన ఉద్యోగులకు.. అదే ర్యాంకులో పనిచేసి 2013 తర్వాత రిటైరైన ఉద్యోగులతో సమానంగా పెన్షన్ అందనుంది. 2014 జూలై 1 నుంచి ఈ పథకం వర్తించనుంది.
కాగా, నోటిఫికేషన్ సరిగా లేదని, తమ డిమాండ్లను సర్కారు పరిగణనలోకి తీసుకోలేదని నిరసన చేస్తున్న సైనికోద్యోగులు విమర్శించారు. ఐదేళ్లకోసారి దీన్ని సమీక్షించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని.. సర్కారు దీన్ని 'వన్ ర్యాంక్ ఫైవ్ పెన్షన్స్'గా మార్చేసిందన్నారు.