ఆ మొబైళ్లను విమానాల్లోకి అనుమతించం:డీజీసీఏ
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ల చరిత్రలోనే తొలిసారిగా భావిస్తున్న నిషేధాన్ని శాంసంగ్ కంపెనీ ఎదుర్కొంటోంది. ప్రయాణ సమయంలో విమానాల్లోకి శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 మొబైల్ ఫోన్లను అనుమతించబోమని విమానయానానికి సంబంధించి భారత్ లో అత్యున్నత సంస్థ అయిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం కీలక ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే ఆస్ట్రేలియా, సింగపూర్ సహా పలు దేశాల విమాయనయాన సంస్థలు ఈ మోడల్ ఫోన్లను నిషేధించాయి.
గత నెలలో విడుదలైన గెలాక్సీ నోట్ 7 ఫోన్లు పేలిపోతున్న ఘటనలు ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న నేపథ్యంలో డీజీసీఏ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. వివిధ దేశాల్లో ఇప్పటివరకు నోట్ 7 మొబైళ్లు పేలిపోయిన ఉదంతాలు కనీసం 35 నమోదయ్యాయి. బ్యాటరీల్లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగానే పేలుళ్లు సంభవిస్తున్నాయన్న శాంసంగ్.. ఒక సిరీస్‌కు చెందిన గెలాక్సీ నోట్ 7 మొబైళ్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. (ఆస్ట్రేలియాలో పేలిన శాంసంగ్ గెలాక్సీ నోట్-7)
డీజీసీఏ ఉత్తర్వుల్లోనూ ఈ మొబైల్ ను నిషేధిస్తున్నట్లు కచ్చితంగా పేర్కొన్నప్పటికీ ఒక మినహాయింపు ఇచ్చింది. మొబైల్ ను స్విచ్ ఆఫ్ చేస్తే మాత్రమే బోర్డింగ్ కు అనుమతిస్తామని చెప్పింది. గతవారం ఆస్ట్రేలియాలో ఓ వ్యక్తి.. హోటల్ గదిలో గెలాక్సీ నోట్ 7 మొబైల్ కు చార్జింగ్ పెట్టి నిద్రిస్తుండగా అది ఒక్కసారిగా పేలిపోయింది. రీకాల్ చేసిన మోడళ్ల స్థానంలో కొత్త వాటిని అందిస్తామని శాంసగ్ ఇప్పటికే చెప్పింది. ముందు జాగ్రత్త చర్యలుగా సదరు మొబైల్ కు చార్జింగ్ పెట్టేటప్పుడు తప్పనిసరిగా స్విచ్ ఆఫ్ చేయాలని పేర్కొంది. (గెలాక్సీ యూజర్లకు షాకిచ్చిన ఎయిర్లైన్స్)