కావేరి సెగతో ఎగిసిన కాలుష్యం
బెంగళూరు : కావేరి నదీ జలాల వివాదంతో చెలరేగిన హింసాత్మక ఘటనలతో ఓ వైపు రూ.25వేల కోట్ల నష్టం వాటిల్లడంతో పాటు, మరోవైపు పర్యావరణానికి భారీగానే ముప్పు తెచ్చిందట. వాహనాలకు, ఇతర ప్రజల ఆస్తులకు నిప్పులంటించడంతో గాలి కాలుష్యం దాదాపు 28 శాతం ఎగిసింది. పశ్చిమ బెంగళూరులో నిరసనకారులు బస్సులకు, టైర్లకు నిప్పులంటించి కావేరి నదీ జలాల వివాదాన్ని హింసాత్మకంగా మార్చిన సంగతి తెలిసిందే. దీంతో హింసాత్మక ప్రాంతాల్లో సాధారణ రోజుల కంటే వివాద సమయంలో గాలి కాలుష్యం 28.8 శాతం పెరిగిందని కర్ణాటక కాలుష్య నియంత్రణ బోర్డు చైర్మన్ లక్ష్మణ్ తెలిపారు. మెటల్, పేయింట్, రబ్బర్తో తయారయ్యే వాహనాలను దగ్ధం చేయడంతో, వివిధ రకాల 100 కెమెకిల్స్ బయటికి పొక్కినట్టు ఆయన చెప్పారు. నేషనల్ లిమిట్ స్థాయిలకు లోబడి సాధారణ రోజుల్లో గాలి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
కానీ నిరసనకారులు రెచ్చిపోవడంతో, రోడ్డుపై దుమ్ము, ధూళి,మసి శాతాలు పెరిగినట్టు వివరించారు. రబ్బర్ టైర్లను కాల్చడం వల్ల గాలి నాణ్యతకు ముప్పు వాటిల్లిందని కేఎస్పీసీబీ సైంటిఫిక్ ఆఫీసర్ డాక్టర్. బి.నాగప్ప తెలిపారు. రబ్బర్ టైర్లను కాల్చడం వల్ల వచ్చే గ్యాస్లు అత్యంత ప్రమాదకరమైనవిగా బీజీఎస్ హాస్పిటల్ పల్మోనాలజిస్ట్ కన్సల్టెంట్ డాక్టర్ సందీప్ వెల్లడించారు. ఇవి మానవ శరీర రక్తంలోని ఆక్సీజన్ కెపాసిటీలపై ప్రభావం చూపుతాయన్నారు. ఆస్తమాతో బాధపడే వారికి ఈ బస్సుల దగ్ధం మరింత అనారోగ్యానికి పాలుచేస్తుందని చెప్పారు. కావేరీ నదీ జల పంపకంపై కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య ఈ వివాదం చెలరేగింది. ఈ వివాదం మరింత ఉధృతంగా మారి హింసాత్మకంగా మారింది. రెచ్చిపోయిన నిరసనకారులు బస్సులకు, ఆస్తులకు నిప్పు పెట్టారు. బెంగళూరు నిప్పుల కొలిమిగా మారిన సంగతి తెలిసిందే.