జవదేకర్ ను ప్రశ్నించిన సీబీఐ
న్యూఢిల్లీ: గుజరాత్‌లో జరిగిన తులసీరాం ప్రజాపతి భూటకపు ఎన్‌కౌంటర్ కేసుకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఎంపీలు ప్రకాశ్ జవదేకర్, భూపేంద్ర యాదవ్‌లను సీబీఐ శుక్రవారం ప్రశ్నించింది. స్వతంత్ర జర్నలిస్‌ట చేసిన శూలశోధనలో లభించిన ఆధారాలపై వారిని విచారణ చేసింది. కేసును నిర్వీర్యం చేసే దిశగా బాధితుడి తల్లి నర్మదాబాయిని ఏవిధంగా ఒప్పించాలనే అంశాలపై వీరు చర్చిస్తుండగా లభించిన వీడియో టేపులపై వివరాలు రాబట్టింది.
ఈ వీడియోలో దర్శనమిచ్చిన బీజేపీ జనరల్ సెక్రటరీ రామ్‌పాల్‌కు కూడా సీబీఐ సమన్లు పంపింది. తన కుమారిడిది భూటకపు ఎన్‌కౌంటర్ అని, దీనిలో నరేంద్ర మోడీ అనుచరుడు అమిత్‌షా హస్తం ఉందని ఆమె ఫిర్యాదు చేశారు. కాగా, సోహ్రబుద్దీన్ హత్య కేసులో ప్రజాపతి ప్రధాన సాక్షి. అయితే స్టింగ్ ఆపరేషన్ ఆరోపణలను బీజేపీ ఖండించింది. తనకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని, సీబీఐ పిలిచినందువల్ల వచ్చానని విచారణ అనంతరం సీబీఐ ప్రధాన కార్యాలయం వద్ద జవదేకర్ చెప్పారు.