సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు అన్ని అనుకూల పరిస్థితులున్నందున వీటిని ఉపయోగించుకుని విజయం సాధించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. విజయం దిశగా కట్టుదిట్ట మైన కార్యాచరణను, ఎన్నికల వ్యూహాలను అమలు చేయాలని రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలను ఆయన ఆదేశించారు. ప్రజల్లో కేసీఆర్ సర్కార్‌పై వ్యతిరేకత వ్యక్తమవుతున్నందున దానిని బీజేపీకి అనుకూలంగా ఓట్లుగా మార్చేకునే దిశగా ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర పార్టీకి, నేతలకు అవసరమైన సహాయ, సహకారాలు, తోడ్పాటును అందించేందుకు జాతీ య నాయకత్వం సిద్ధం ఉందని హామీ నిచ్చారు.
మంగళవారం రాత్రి బేగంపేటకు సమీపంలోని ఓ స్టార్ హోటల్‌లో కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర పార్టీ ఎన్నికల ఇన్‌చార్జి ప్రకాశ్ జవదేకర్‌తో అమిత్ షా భేటీ అయ్యారు. ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తీరు, ఎన్నికల మేనిఫెస్టో తయారీ, అభ్యర్థులకు సంబంధించి రెండు, మూడు జాబితాల తయారీపై కసరత్తు, ఎన్నికల్లో అనుసరించబోయే వ్యూహాలు, ప్రచార సరళి తదితర అంశాలన్నింటిపైనా సమీక్ష నిర్వహించినట్టు సమాచారం.గ్రేటర్‌పై ఫోకస్ పెంచండిజీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 48 సీట్లు గెలిచి అనూహ్య ఫలితాలు సాధించినందున, గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి రంగారెడ్డి, చుట్టుపక్కల జిల్లాలపై ఫోకస్ పెట్టి అత్యధిక స్థానాలు గెలిచేలా ప్రత్యేక కార్యాచరణను రూపొందించాలని అమిత్ షా ఆదేశించినట్టు తెలుస్తోంది.
అదేవిధంగా పార్టీకి బలమున్న ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్‌లతో పాటు మహబూబ్‌నగర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించినట్టు తెలిసింది. ఇక పార్టీపరంగా అంతగా బలం లేని ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌తో పాటు నల్లగొండ జిల్లా పరిధిలోని కొన్ని నియోజకవర్గాల్లో కార్యకలాపాలు, ఎన్నికల ప్రచారవేగం ముమ్మరం చేయాలని ఆదేశించినట్టు సమాచారం. ఈ భేటీ అనంతరం అమిత్ షాను నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి, రాష్ట్ర పార్టీ ప్రధానకార్యదర్శి బంగారు శ్రుతి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక బేగంపేట విమానాశ్రయంలో అమిత్‌షాను బీజేపీ జాతీయకార్యవర్గసభ్యుడు కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి కలుసుకున్నారు.
తొలి జాబితాలోని 38 మంది అభ్యర్థుల బలాబలాలపై ఆరా
ఇక ఎన్నికల్లో పోటీకి సంబంధించి ఖరారు చేయబోతున్న 38 మంది అభ్యర్థుల తొలి జాబితాపై చర్చించారు. వీరి విజయావకాశాలు, బలాబలాలు తదితర అంశాలపై ఆరా తీసినట్టు తెలిసింది. ప్రస్తుతం పార్టీలో వివిధ స్థానాల్లో (తొలిజాబితా మినహాయించి) పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్న వారు, పార్టీ పరంగా బలమైన అభ్యర్థులుగా పరిగణిస్తున్న వారు ఎవరెవరు ఉన్నారన్న అంశాలపైనా ఆరా తీసినట్టు సమాచారం. బీజేపీలో చేరేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్న వాళ్లెవరు, ఏ స్థానంలోనైనా సీటు కావాలని కోరుకుంటున్న వారెవరు, చేరేందుకు ఏదైనా కమిట్ మెంట్, హామీ కోరుకుంటున్నారా అన్న విషయాలపై రాష్ట్ర పార్టీ నేతలను అమిత్‌షా ప్రశ్నించినట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment