హిమాచల్‌ సీఎం ఇంటిపై సీబీఐ దాడులు | CBI rides on Himachal pradesh Chief minister house | Sakshi
Sakshi News home page

హిమాచల్‌ సీఎం ఇంటిపై సీబీఐ దాడులు

Sep 27 2015 3:45 AM | Updated on Sep 3 2017 10:01 AM

హిమాచల్‌ సీఎం ఇంటిపై సీబీఐ దాడులు

హిమాచల్‌ సీఎం ఇంటిపై సీబీఐ దాడులు

హిమాచల్‌ప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ నివాసంపై శనివారం ఉదయం సీబీఐ దాడులు చేసింది.

 * తన కుమార్తె వివాహం కోసం ఆలయానికి వెళ్లిన వీరభద్రసింగ్
తర్వాత కొద్ది నిమిషాలకే అధికారిక నివాసం సహా 12 చోట్ల తనిఖీలు
* ఆదాయానికి మించి ఆస్తుల ఆరోపణలతో కేసు నమోదు

 
 సిమ్లా/న్యూఢిల్లీ: హిమాచల్‌ప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ నివాసంపై శనివారం ఉదయం సీబీఐ దాడులు చేసింది. తన రెండో కుమార్తె వివాహం కోసం వీరభద్రసింగ్ సిమ్లాలోని ఓ గుడికి బయలుదేరిన కొద్ది నిమిషాలకే ఈ తనిఖీలు జరిగాయి. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో ఆయన ఇంటితోపాటు బంధువులు, స్నేహితులకు చెందిన 12 చోట్ల అధికారులు దాడులు చేశారు. హిమాచల్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ఎన్డీయే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆ రాష్ట్ర మంత్రులంతా ఉమ్మడి ప్రకటన జారీ చేసిన మరునాడే... సీఎం వీరభద్రసింగ్‌పై సీబీఐ దాడులు జరగడం గమనార్హం. 2009-11 మధ్యలో కేంద్రంలోని యూపీఏ కేబినెట్‌లో కేంద్ర ఉక్కు మంత్రిగా పనిచేసినప్పుడు వీరభద్రసింగ్ ఆదాయానికి మించి రూ. 6.1 కోట్ల ఆస్తులు కూడబెట్టారని... ఈ సొమ్మును కుటుంబ సభ్యుల పేరిట ఎల్‌ఐసీ పాలసీలలో మదుపు చేశారని ఆరోపణలున్నాయి. దీనిపై ప్రాథమిక విచారణ నివేదిక నమోదు చేసిన సీబీఐ... కొద్దిరోజుల కిందే దానిని అవినీతి నిరోధక చట్టం కింద కేసుగా మార్చింది.
 
 వీరభద్రతోపాటు ఆయన భార్య ప్రతిభ, మరో ఇద్దరిపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసి.. శనివారం దాడులు చేసింది. ఉదయం 7.30 సమయంలో తన రెండో కుమార్తె పెళ్లి నిమిత్తం వీరభద్ర సిమ్లాలోని సంకట్ మోచన్ ఆలయానికి బయలుదేరారు. కొద్దిసేపటికే సీఎం అధికారిక నివాసంపై 18 మంది సీబీఐ అధికారుల బృందం దాడులు చేసింది. దీంతో పాటు మరో రెండు ఇళ్లు, ఢిల్లీలోని అధికారిక నివాసం, ఫామ్‌హౌజ్‌పై, ఆయన స్నేహితులు ఆనంద్ చౌహాన్, చున్నిలాల్‌లకు చెందిన ఐదు నివాసాల్లో తనిఖీలు చేశారు. అయితే వివాహం అనంతరం వీరభద్రసింగ్ కుటుంబం 11గంటలకు నివాసానికి తిరిగి వచ్చింది. కాగా, మోదీ ప్రభుత్వం సీబీఐని ఉపయోగించి విపక్షాలపై కక్ష సాధిస్తోందని  కాంగ్రెస్ పార్టీ మండిపడింది. అధికార దుర్వినియోగానికి పాల్పడిన వీరభద్రసింగ్ రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement