దక్షిణాది టాప్ ప్లేయర్‌గా సెల్‌కాన్ | celkon is the top player at the south | Sakshi
Sakshi News home page

దక్షిణాది టాప్ ప్లేయర్‌గా సెల్‌కాన్

Published Wed, Mar 4 2015 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 10:14 PM

దక్షిణాది టాప్ ప్లేయర్‌గా సెల్‌కాన్

దక్షిణాది టాప్ ప్లేయర్‌గా సెల్‌కాన్

మొబైల్ ఫోన్ల రంగంలో ఉన్న సెల్‌కాన్ దక్షిణాది రాష్ట్రాల్లో తన హవాను కొనసాగిస్తోంది. అమ్మకాల పరంగా దక్షిణాదిన తొలి స్థానంలో నిలిచిన సంస్థ..

 నెలకు 4 లక్షల మొబైల్స్ విక్రయం
 
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల రంగంలో ఉన్న సెల్‌కాన్ దక్షిణాది రాష్ట్రాల్లో తన హవాను కొనసాగిస్తోంది. అమ్మకాల పరంగా దక్షిణాదిన తొలి స్థానంలో నిలిచిన సంస్థ.. ఇదే ఊపుతో ఇప్పుడు విదేశీ మార్కెట్లపై దృష్టిసారించింది. ఈ ఏడాది కొత్తగా 30 దేశాల్లో అడుగు పెట్టాలని నిర్ణయించింది. అంతర్జాతీయ విపణిలో నెలకు 5 లక్షల యూనిట్లు విక్రయించాలని లక్ష్యంగా చేసుకుంది. 2014లో 25 మోడళ్లను ఆవిష్కరించిన కంపెనీ ఈ ఏడాది 40 కొత్త ఫోన్లను పరిచయం చేస్తోంది.

దక్షిణాది రాష్ట్రాల్లో నెలకు 24 లక్షల  ఫోన్లు అమ్ముడవుతున్నాయి. ఇందులో సెల్‌కాన్ వాటా 4 లక్షల యూనిట్లు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నెలకు 9 లక్షల పీసులు విక్రయమవుతుండగా, సెల్‌కాన్ 3 లక్షల యూనిట ్లతో ముందంజలో ఉంది. రెండో స్థానంలో ఉన్న కంపెనీ నెలకు 2 లక్షల యూనిట్లు విక్రయిస్తోంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్, కస్టమ్స్ నుంచి ఇటీవలే టాప్ ఇంపోర్టర్ అవార్డును సైతం సెల్‌కాన్ దక్కించుకుంది.
 
వాయిస్ కాల్ ట్యాబ్ రూ.4 వేలకే..
ట్యాబ్లెట్ల అమ్మకాల్లో 2012లో దక్షిణాదిన తొలి స్థానాన్ని సెల్‌కాన్ దక్కించుకుంది. దేశీయ మార్కెట్లో ట్యాబ్లెట్ పీసీలకు డిమాండ్ పెరుగుతుండడంతో కంపెనీ తిరిగి ఈ విభాగంపై దృష్టిసారించింది. రూ.4 వేలకే డ్యుయల్ సిమ్ ట్యాబ్లెట్‌ను తీసుకొస్తోంది. అలాగే ఇంటెల్ ప్రాసెసర్‌తో 3జీ క్వాడ్‌కోర్ ట్యాబ్‌ను ప్రవేశపెడుతోంది. 8 అంగుళాల మోడల్ కూడా రానుంది. అన్నీ రూ.10 వేల లోపు ధరలో ఉంటాయి. ఇక కార్పొరేట్ కంపెనీల కోసం కస్టమైజ్డ్ ట్యాబ్స్‌ను అందిస్తున్నామని సెల్‌కాన్ సీఎండీ వై.గురు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ట్యాబ్లెట్లను సరఫరా చేసేందుకు జాతీయ స్థాయిలో ప్రభుత్వంతోనూ చర్చిస్తున్నట్టు చెప్పారు.
 
ఇవీ కొత్త మోడళ్లు..
అక్టాకోర్‌లో రూ.6 వేలకే స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్‌లో వస్తోంది. గతేడాది ఇదే ధరలో క్వాడ్‌కోర్‌ను అందించింది. 4,000 ఎంఏహెచ్ బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్ రానుంది. రూ.5,555 ధరలో క్యూ54 పేరుతో 5 అంగుళాల స్క్రీన్‌తో, క్వాడ్‌కోర్, 3జీ ఫీచర్లతో సెల్ఫీ మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. రెండు వైపులా 5 ఎంపీ కెమెరాలను పొందుపరిచారు. వేలి ముద్ర, మొహం, మాటలను గుర్తించి పనిచేసే వ్యవస్థ ఉంది. కార్పొరేట్ కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని ఈ ఫీచర్లను జత చేశారు. యాక్సెసరీస్ విషయంలో ప్రధానంగా పవర్ బ్యాంక్‌ల పట్ల ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో అధిక సామర్థ్యం గల మోడళ్లను సంస్థ తీసుకొస్తోంది.

4జీ కోసం బార్సిలోనా..
 ఈ నెల 2-5 తేదీల్లో స్పెయిన్‌లోని బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో కంపెనీ పాల్గొంటోంది. స్మార్ట్‌ఫోన్ల రంగంలో వస్తున్న కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంటామని గురు తెలిపారు. ప్రధానంగా 4జీపై దృష్టిసారిస్తామని వెల్లడించారు. 2015లో కంపెనీ ప్రధాన ఫోకస్ స్మార్ ్టఫోన్లపైనే ఉంటుందని చెప్పారు. ఇందుకోసం టెక్నాలజీ కంపెనీలతో బార్సిలోనా వేదికగా చేతులు కలుపుతామని వెల్లడించారు. కస్టమర్లకు అందుబాటు ధరలో ఆధునిక ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్లను అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. చైనాలోని షెంజెన్‌లో నెలకు 5 లక్షల యూనిట్ల సామర్థ్యంతో అసెంబ్లింగ్ యూనిట్‌ను సెల్‌కాన్ ఏర్పాటు చేసింది. పరిశోధన, అభివృద్ధి కేంద్రంతోపాటు ఫోన్లను పరీక్షించేందుకు ల్యాబ్‌ను నెలకొల్పింది.
 
 
సెల్‌కాన్ కేర్..
సర్వీసింగ్‌కు పెద్ద పీట వేస్తూ సెల్‌కాన్ కేర్ కేంద్రాల సంఖ్యను గణనీయంగా పెంచుతోంది. తక్కువ సమయంలో ఫోన్ల రిపేర్ పూర్తి కావాలన్నది కంపెనీ ఉద్దేశం. ఇటువంటివి ప్రస్తుతం 20 సెంటర్లున్నాయి. మార్చికల్లా దక్షిణాదిన మరో 50 ఏర్పాటు చేస్తోంది. ఉత్తరాదిన మూడు నెలల్లో 20 కేంద్రాలు రానున్నాయి. సెల్‌కాన్ పాత ఫోన్ల విడిభాగాలు, కొత్త మోడళ్లు, యాక్సెసరీస్ ఇక్కడ లభిస్తాయి. పాత ఫోన్ ఇచ్చి కొత్తది కొనుక్కునే అవకాశమూ ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 850పైగా అధీకృత సర్వీస్ సెంటర్లను కంపెనీ నిర్వహిస్తోంది.
 
తరగని డిమాండ్.. ఏ35కే !
3జీ, కిట్‌క్యాట్ ఓఎస్‌తో కంపెనీ ప్రవేశపెట్టిన ఏ35కే మోడల్‌కు ప్రపంచవ్యాప్తంగా అనూహ్య స్పందన లభిస్తోంది. రూ.2,999 ధరలో భారత్‌లో ఇటువంటి మోడల్ ప్రవేశపెట్టిన ఘనత సెల్‌కాన్‌దే. రష్యా, స్పెయిన్, ఆఫ్రికా నుంచి కొత్త ఆర్డర్లు వెల్లువెత్తాయని కంపెనీ తెలిపింది. ఇప్పటికే 2 లక్షల పీసులు అమ్ముడయ్యాయి. మరో 5 లక్షల యూనిట్లు విక్రయించాలని లక్ష్యంగా చేసుకుంది. ప్రస్తుతం సెల్‌కాన్ 15 దేశాల్లో సెల్‌ఫోన్లను విక్రయిస్తోంది. ఈ ఏడాది మరో 30 దే శాల్లో అడుగు పెట్టాలని కృతనిశ్చయంతో ఉంది. రష్యా, దుబాయ్‌లో పెద్ద ఎత్తున విస్తరించేందుకు కార్యాలయాలను ఏర్పాటు చేస్తోంది. ఆఫ్రికా దేశాల కోసం ప్రత్యేక సేల్స్ టీమ్‌ను నియమించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement