అలాంటి వారి జాబితా పంపాలని కోరిన డీవోపీటీ
న్యూఢిల్లీ: బ్యూరోక్రాటిక్ వ్యవస్థలో ప్రక్షాళనకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా అలసత్వ, అసమర్థ అధికారులకు ఉద్వాసన పలకడానికి నిర్ణయించింది. అలాంటి వారి జాబితా ఇవ్వాలని అన్ని శాఖలను కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) కోరింది. కేబినెట్ సెక్రటరీ పి.కె.సిన్హా నేతృత్వంలో ఈ మధ్యనే జరిగిన సమావేశంలో ప్రభుత్వ అధికారుల్లో బాధ్యత, సచ్ఛీలత పెంచడానికి పలు నిర్ణయాలు తీసుకున్నారు.
ప్రజాప్రయోజనార్థం అసమర్థ అధికారులకు ఫండమెంటల్ రూల్ 56 (జె) ప్రకారం ముందస్తుగానే రిటైర్మెంట్ ఇచ్చేయాలని తీర్మానించారు. గ్రూప్ ఎ, బి, సి ఉద్యోగుల్లో అవినీతి, అసమర్థ అధికారులపై ఈ విధమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
గత కొన్నేళ్లుగా ఇంక్రిమెంట్లు ఆగిపోయిన, ఐదేళ్లుగా ఏ విధమైన ప్రమోషన్లులేని అధికారులపై వేటు వేయనున్నారు. సున్నితమైన, ఇతర పోస్టుల్లోని అధికారుల రొటేషన్‌పైన కూడా ఆ సమావేశంలో చర్చించారు. తమ నిర్ణయాలను నిర్ణీత కాలవ్యవధిలో అన్ని శాఖలు అమలు చేయాలని డీవోపీటీ కోరింది. అసమర్థ, అవినీతి అధికారులకు సంబంధించిన సమాచారాన్ని తొందరగా అంతర్గత నిఘా విభాగానికి పంపాలని అన్ని శాఖలకు విజ్ఞప్తి చేసింది. దీనికి సంబంధించి కేబినెట్ సెక్రటరీ ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తారని పేర్కొంది.
అసమర్థ అధికారులకు ఉద్వాసన!
Published Wed, Sep 16 2015 1:45 AM | Last Updated on Sun, Sep 3 2017 9:27 AM
Advertisement
Advertisement