ల్యాప్‌టాప్ బుక్ చేస్తే ఏం వచ్చిందో తెలుసా?
ల్యాప్‌టాప్ బుక్ చేస్తే ఏం వచ్చిందో తెలుసా?
Published Mon, Dec 26 2016 11:00 AM | Last Updated on Mon, Sep 4 2017 11:39 PM
ఆన్‌లైన్‌లో మంచి ల్యాప్‌టాప్ చూసుకుని, దాని కాన్ఫిగరేషన్ అంతా చెక్ చేసుకుని బుక్ చేసుకుంటే.. తీరా ఇంటికి పార్సిల్ వచ్చిన తర్వాత ఆ బాక్సులో ల్యాప్‌టాప్‌కు బదులు అందమైన మెటల్ ఫ్రేములో అమర్చిన టైల్స్ కనిపిస్తున్నాయి. మధ్యలో ఒక గ్యాంగు జోక్యం వల్లే ఇదంతా జరుగుతోందని ఎట్టకేలకు తేలింది. ఆ గ్యాంగుకు చెందిన ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే ఇలా హై ఎండ్ ల్యాప్‌టాప్‌లను వాళ్లు చోరీ చేసి, అమ్మేసుకుంటున్నారు కూడా. ల్యాప్‌టాప్‌లను చోరీ చేసి, వాటి స్థానంలో సిరామిక్ టైల్స్‌ను ఉంచుతున్నారు. వాటి బరువు కూడా ఏమాత్రం తేడా రాకుండా ఉండేందుకు వాటిని మెటల్ ఫ్రేములలో బిగిస్తున్నారు. ఇలాంటి గ్యాంగులు ఇప్పటివరకు 45 ల్యాప్‌టాప్‌లు చోరీ చేయగా, వాటిలో 28 ల్యాప్‌టాప్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిందితులు ఆదేశ్ కుమార్ (25), శైలేంద్రకుమార్ (22), సుబోధ్ రాయ్ (34), మిథున్ కుమార్ (22), సనోజ్ కుమార్ (22), జయేష్ పటేల్‌లను అరెస్టు చేసినట్లు డీసీపీ రోమిల్ బానియా చెప్పారు. ఒక కార్గో కంపెనీ యజమాని సందీప్ శర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఓఖ్లా ఇండస్ట్రియల్ ఏరియా పోలీసు స్టేషన్‌లో డిసెంబర్ 18న కేసు నమోదు చేశామని, తమ వాహనంలో తాము డిసెంబర్ 5న 140 ల్యాప్‌టాప్‌లు లోడ్ చేసి, డెలివరీకి పంపామని, తీరా అవి బయటకు వెళ్లేసరికి వాటిలో 38 ల్యాప్‌టాప్‌లు, వాటి చార్జర్లు కనిపించలేదని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. లోపలి వాళ్లే ఈ చోరీకి పాల్పడి ఉంటారని అనుమానంతో కల్కాజీ ఏసీపీ అమిత్ గోయల్ దర్యాప్తు చేయగా, డ్రైవర్ ఆదేశ్ కుమార్ మీద మొదట అనుమానం వచ్చింది. అతడిని విచారించగా మిగిలిన గ్యాంగు మొత్తం బయటపడింది. వీళ్లలో జయేష్ పటేల్ పది ల్యాప్‌టాప్‌లు తీసుకుని ముంబై వెళ్లాడని, అతడిని పట్టుకోడానికి గాలింపు జరుగుతోందని డీసీపీ చెప్పారు.
Advertisement
Advertisement