మోదీ.. మీకిదే నా చాలెంజ్
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ఎంపీలను వారం వ్యవధిలో సీబీఐ అరెస్ట్ చేయడంపై ఆ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద నోట్లను రద్దును తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నందున ప్రధాని నరేంద్ర మోదీ సీబీఐని అడ్డుపెట్టుకుని తమపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. నోట్ల రద్దు తర్వాత తృణమూల్ కాంగ్రెస్‌ను రద్దు చేయాలని మోదీ భావిస్తున్నారని ఆరోపించారు. పార్టీ ఎంపీలు సుదీప్ బందోపాధ్యాయ్, తపస్ పాల్‌లను సీబీఐ అరెస్ట్ చేయడాన్ని రాజకీయ కక్షసాధింపు చర్యగా ఆమె అభివర్ణించారు. 'మోదీకి ఛాలెంజ్ చేస్తున్నా, మా పార్టీ నేతలను అరెస్ట్ చేయిస్తే పారిపోతారని మీరు భావిస్తున్నారేమో, మేం భయపడేది లేదు' అని మమత అన్నారు.
పార్టీ ఎంపీలను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ కోల్‌కతాలో బుధవారం నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని మమత చెప్పారు. పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రిజర్వ్ బ్యాంకు కార్యాలయం ఎదుట ఈ నెల 9, 10, 11 తేదీల్లో నిరసన తెలియజేస్తామన్నారు. అలాగే 10 రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు చేపడతామని తెలిపారు. మంగళవారం రోజ్ వాలీ చిట్ ఫండ్ కుంభకోణంలో టీఎంసీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. డిసెంబర్ 30న ఇదే కేసులో టీఎంసీకే చెందిన ఎంపీ తపస్ పాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.