
చంద్రబాబు ‘విభజన’ దీక్ష
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రాన్ని విభజించండి. కానీ సంప్రదింపులు జరిపిన తర్వాతే ఆ పని చేయాలి’ అన్న డిమాండ్‌తో అక్టోబర్ 7వ తేదీ సోమవారం నుంచి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో నిరవధిక నిరాహార దీక్ష చేయనున్నారు. శుక్రవారం రాత్రి విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, ‘రాష్ట్రాన్ని విభజించండి. అయితే అన్ని వర్గాలతో సంప్రదింపులు జరపండి’ అని తాను ఎన్నిసార్లు చెప్పినా కేంద్రం పట్టించుకోవటం లేదని బాబు అన్నారు. గతంలో ఏ రాష్ట్రాన్ని విభజించినప్పుడు కూడా ఇలాంటి పద్ధతిని అవలంబించలేదన్నారు.
ప్రజల ప్రయోజనాలను పట్టించుకోకుండా రాజకీయ కారణాలతో చేసిన విభజనను ఖండిస్తున్నానన్నారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ అనుసరించిన వైఖరి, దాని కుట్రలు, కుతంత్రాలను ప్రజలతో పాటు అన్ని పార్టీలకు వివరించేందుకు, దేశం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు దోషిగా నిల బెట్టేందుకు దీక్ష చేస్తున్నట్టు తెలిపారు. రాజకీయ కారణాలతోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజిస్తోందన్నారు. ‘మీరు ఢిల్లీలో చేయనున్న దీక్ష సమైక్య, విభజనవాదాల్లో దేనికి అనుకూలమో చెప్పండి’ అని అడిగిన విలేకరిపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘మీరు ఎప్పుడూ అటే పోతూ ఉంటారు’అంటూ ఆగ్రహం ప్రదర్శించారు. ఇక షరామామూలుగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు గుప్పించారు. విభజన అంశాన్ని కేబినెట్ సమావేశంలో టేబుల్ ఐటంగా పెట్టడాన్ని తప్పుపట్టారు. ఇంత కీలకమైన అంశాన్ని అలా ఎలా పెడతారని ప్రశ్నించారు. ‘‘ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. కాంగ్రెస్ నేతలతో పాటు అధికారులందరూ వాటిలో తీరిక లేకుండా ఉం టారు. ఆ తర్వాత మరో నాలుగు నెల ల్లో సాధారణ ఎన్నికలు వస్తాయి. అటువంటప్పుడు ఇప్పుడిచ్చిన హామీలకు ఎవరు బాధ్యత వహిస్తారు? సొంత పార్టీ వారినే సముదాయించలేని కాంగ్రెస్ వారు ప్రజలకు ఏం చెబుతారు?’’ అని ప్రశ్నించారు. సమస్యను ఎవరికీ నష్టం జరగకుండా పరిష్కరించాలని తాను పోరాడుతుంటే, 175 అసెంబ్లీ స్థానాల్లోనే ఆందోళనలకు పిలుపునిచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి, తాను సమైక్యవాద చాంపియన్‌నని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.
ఈ విలేకరుల సమావేశానికి ‘సాక్షి’ ప్రతినిధిని అనుమతించలేదు. పలు రూపాల్లో సేకరించిన సమాచారం మేరకు ఈ వార్తను ఇస్తున్నాం. ఒకవేళ ‘సాక్షి’ని అనుమతించి ఉంటే ఈ కింది ప్రశ్నలకు బాబు నుంచి సమాధానాలు రాబట్టేది..
1. తెలంగాణ రాష్ర్టం ఏర్పాటుకు అవసరమైన రాజకీయ ప్రక్రియకు సహకరిస్తామని కేంద్రానికి పార్టీపరంగా తీర్మానం చేసి పంపింది మీ టీడీపీయే కాదా?
2. 2008లో తెలంగాణకు అనుకూలంగా పొలిట్‌బ్యూరో తీర్మానం చేసినప్పుడు గానీ, కేంద్రానికి ఇచ్చిన లేఖలో ఎక్కడా చెప్పకుండా, ఇప్పుడు ‘సంప్రదింపులు జరిపి విభజించండి’ అని చెప్పడంలో అర్థమేమిటి?
3. రాష్ట్రాన్ని విభజించండి గానీ అన్ని వర్గాలతో సంప్రదింపులు జరపాలని కోరుతూ నిరాహార దీక్ష చేయడమంటే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కాకుండా, విభజన చేయమనే కదా మీ డిమాండ్?
4. రాష్ట్రాన్ని విభజించిన తర్వాత సీమాంధ్రలో కొత్త రాజధాని నిర్మాణం కోసం నాలుగైదు లక్షల కోట్ల రూపాయలు కావాలని డిమాండ్ చేసిన మీరు, ఇప్పుడు మళ్లీ సంప్రదింపులు జరపాలని డిమాండ్ చేయడం ఏ మేరకు సరైనది?
5. 2009 డిసెంబర్‌లో కేసీఆర్ దీక్ష చేసిన సమయంలో అప్పటి ముఖ్యమంత్రి కె.రోశ య్య ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం పెడితే సహకరిస్తామన్నది మీరే కదా? మరిప్పుడు ఒకవేళ అసెంబ్లీలో తీర్మానం వ స్తే సమర్థిస్తారా?
తమ్ముళ్లలో భిన్నాభిప్రాయాలు
చంద్రబాబు దీక్షపై టీడీపీ నేతల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తెలంగాణ నేతలు దీక్షను పూర్తిగా వ్యతిరేకించారు. గతంలో చేసిన వ్యాఖ్యల వల్ల ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడ్డామని, విభజన ప్రక్రియను నిరసిస్తూ ఇప్పుడు దీక్ష చేస్తే మళ్లీ నష్టం జరుగుతుందని వారు చెప్పినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. కానీ బాబు మాత్రం సీమాంధ్ర ప్రాంతంలో పార్టీ బతికి బట్టకట్టాలంటే ఏదో ఒకటి చేయాలంటూ వారిని సముదాయించినట్టు చెప్పాయి. దీక్షను ఢిల్లీలో చేస్తానన్న బాబు నిర్ణయంపైనా నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. సమస్యను ఎదుర్కొంటున్నది రాష్ట్ర ప్రజలు గనుక హైదరాబాద్‌లో చేస్తే బాగుంటుందని సూచించారు. కానీ బాబు అందుకు అంగీకరించలేదు. విజయవాడ లేదా తిరుపతిల్లో దీక్ష చేస్తానన్నారు. దానికి నేతలు అయిష్టత చూపారు.
సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రతరమైంది. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నివాసం, ఆయన వ్యాపార సంస్థలపై దాడులకు పాల్పడుతున్నారు. మంత్రుల ఇళ్లపై కూడా దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి ఆవేశపూరిత పరిస్థితులున్నప్పుడు తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన మీరు సీమాంధ్రలో అలాంటి ప్రయోగాలు చేయకపోవడమే మంచిది’’ అని వారు సూచించారు. దాంతో తీవ్ర తర్జనభర్జన తర్వాత, ఢిల్లీలో దీక్షకు నిర్ణయించారు. దీక్షా శిబిరాన్ని జాతీయ స్థాయి రాజకీయ నాయకులు విడతలవారీగా సందర్శించేలా ఆయా పార్టీల నేతలను సంప్రదించాలని ఎంపీలను బాబు ఈ సందర్భంగా ఆదేశించినట్టు కూడా పార్టీ నేతలు తెలిపారు. ‘తద్వారా మనం చేపట్టే దీక్షకు జాతీయ స్థాయిలో మంచి ప్రచారం లభిస్తుంది’ అని బాబు చెప్పినట్టు వివరించారు!