బుర్జ్ ఖలీపా కన్నా మన ఆలయానికే..
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రపంచంలోని అతిపెద్ద ఆలయం 'చంద్రోదయ మందిరం' మరో అరుదైన ఘనతను సొంతం చేసుకోబోతున్నది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన కట్టడమైన బూర్జ్ ఖలీఫా కన్నా లోతైన పునాదితో ఈ ఆలయాన్ని నిర్మిస్తుండటం గమనార్హం. బూర్జ్ ఖలీఫా పునాదికి 50 మీటర్ల లోతు ఉండగా.. అంతకన్నా ఐదు మీటర్ల ఎక్కువ లోతు పునాదితో ఉత్తరప్రదేశ్ బృందావన్ లో 'చంద్రోదయ మందిరం' నిర్మాణమవుతోంది.
ఈ ఆలయానికి 55 మీటర్ల లోతు పునాది ఉంటుందని, వచ్చే ఏడాది మార్చిలోగా పునాది నిర్మాణం పూర్తి అవుతుందని ఆలయ ప్రాజెక్టు డైరెక్టర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నరసింహా దాస్ తెలిపారు. ఎత్తుపరంగానే కాకుండా ఇందులోని అటవీప్రాంతం, థీమ్ పార్కుల విషయంలోనూ ఎన్నో విశిష్టతలు ఈ ఆలయం కలిగి ఉంది. ఆ ఆలయం పరిసరాల్లో ఏర్పాటుచేస్తున్న థీమ్ పార్కులో డార్క్ రైడ్స్, లైటింగ్, సౌండింగ్ స్పెషల్ ఎఫెక్ట్స్, శ్రీకృష్ణుని జీవితాన్ని ప్రతిబింబించేలా లేజర్ షోలు వంటివి ఉంటాయని నరసింహ దాస్ వివరించారు.
ఏడు వందల అడుగుల ఎత్తుతో, రూ. 700 కోట్ల వ్యయంతో 2022 నాటికి ప్రపంచంలోనే ఎత్తైన ఈ ఆలయం నిర్మాణం పూర్తికానుంది. బెంగళూరు ఇస్కాన్ భక్తుల ఆలోచనకు అనుగుణంగా నిర్మితమవుతున్న ఈ ఆలయంలో 12 అటవీ ప్రాంత నమూనాలు ఉంటాయి. మధువనం, తాలవనం, కుముదవనం, బహుళవనం, కామ్యవనం, ఖదిరవనం, బృందావనం, భద్రావనం, బిల్వవనం, లోహవనం, భాందిరవనం, మహావనం పేరిట ఈ అటవీ నమూనాలు నిర్మాణం కానున్నాయి. ఇక రాధాకృష్ణులు, కృష్ణాబలరాములు, చైతన్య మహాప్రభు, స్వామి ప్రభుపాద తదితరులు నలుగురి ఆలయాలు కూడా ఇందులో ఉంటాయి. మ్యూజిక్ ఫౌంటెయిన్లు, గార్డెన్లు వంటివెన్నో అద్భుతమైన చూడదగ్గ ప్రదేశాలతో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు.