
సీఎం, డిప్యూటీలపై చార్జిషీట్లు!
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై ఢిల్లీ పోలీసులు ఆరుసార్లు చార్జిషీటు దాఖలు చేశారు. రెండు కేసుల్లో ఇప్పటికీ విచారణ కొనసాగుతోంది. అలాగే ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా మీద కూడా చార్జిషీటు దాఖలైంది. ఆమ్ ఆద్మీ పార్టీలోని 21 మంది ఎమ్మెల్యేలపై మొత్తం 24 కేసులు ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ కేసుల దర్యాప్తును వీలైనంత త్వరగా పూర్తిచేసి, వాటిపై చార్జిషీట్లను త్వరలోనే దాఖలు చేయనున్నారు. సీఎం కేజ్రీవాల్ మీద ఉన్న కేసుల్లో.. నిషేధ ఉత్తర్వులు ఉన్నప్పటికీ ప్రదర్శనలు, నిరసనలు నిర్వహించడం, ప్రభుత్వాధికారులను వాళ్ల విధులు నిర్వర్తించనివ్వకుండా అడ్డుకోవడం లాంటి కేసులున్నాయి. ఇక ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా అయితే 2014 జనవరిలో రైల్వే భవన్ నిరసన కార్యక్రమలో పాల్గొన్నారు. ఆయన కూడా నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించిన కేసులో బుక్కయ్యారు.
మాజీ న్యాయశాఖ మంత్రి జితేంద్ర సింగ్ తోమర్ మీద మోసం / ఫోర్జరీ కేసులు నమోదయ్యాయి. ఇక కరోల్బాగ్ ఎమ్మెల్యే విశేష్ రవిపై కేసులో ప్రాథమిక దర్యాప్తునకు ఆదేశించారు. మనోజ్ కుమార్ అనే ఎమ్మెల్యే మీద కూడా మోసం, ఫోర్జరీ కేసులున్నాయి. వాటితో పాటు మహిళల పట్ల అసభ్య ప్రవర్తన కేసు కూడా ఉంది. ఆయన మీద నాలుగు ఎఫ్ఐఆర్లు పెండింగులో ఉన్నాయి. నరేష్ బలియాన్ అనే ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో మద్యం పంచుతూ పట్టుబడ్డారు. ప్రభుత్వోద్యోగిపై దాడి కేసులో జర్నైల్ సింగ్ అనే ఎమ్మెల్యే బుక్కయ్యారు. ఇక మరో మాజీ న్యాయశాఖ మంత్రి సోమనాథ్ భారతి భార్యఆయన మీద ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. భారతి తనను శారీరకంగా, మానసికంగా చిత్రహింసలు పెట్టారని, తనమీదకు కుక్కలను వదిలారని కూడా ఆమె ఆరోపించారు.