బాలుడిని చిరుతే తినేసింది
* కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఘోరం
బెంగళూరు, న్యూస్‌లైన్: ఎప్పటిలానే.. ఆరోజూ స్కూల్లో చివరిబెల్ మోగింది. ఆరేళ్ల బాలుడు పుస్తకాల బ్యాగుతో ఆదుర్దాగా ఇంటికి చేరుకున్నాడు. తనను ప్రేమగా చూసుకునే అవ్వ, తాత కనిపించలేదు. అమ్మను అడిగితే.. పొలానికి వెళ్లార్రా అని చెప్పింది. వారిని వెతుక్కుంటూ పొలంవైపు ఆ చిన్నారి ఒక్కడే అడుగులు వేస్తూ ధైర్యంగా వెళ్లాడు. ఇంతలో ఎక్కడి నుంచో మాయదారి చిరుత పులి ఊడిపడింది. రాక్షసంగా ఆ పసివాడిపై దాడి చేసి తినేసింది. అమ్మా అంటూ ఆ చిన్నారి చేసిన ఆర్తనాదాలు.. ఆ తల్లి చెవిని చేరేలోపే పసివాడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
కన్నీళ్లు తెప్పించే ఈ ఘటన కర్ణాటకలోని హసన్ జిల్లా లో బుధవారం జరిగింది. హాసన్ జిల్లా హొసళేహొసళ్లి సమీపంలోని నాగేనహళ్లి గ్రామానికి చెందిన అణ్గేగౌడ కుమారుడు తేజస్(6) బుధవారం సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వచ్చాడు. పొలంలో ఉన్న అవ్వ, తాత కోసం వెళుతుండగా.. మార్గ మధ్యంలో ఓ చిరుత పులి తేజస్‌ను ఈడ్చుకుని పొదల్లోకి లాక్కెళ్లి తినేసింది. రాత్రి అయినా తేజస్ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సమీప ప్రాంతాల్లో గాలించారు.
పొలం సమీపంలోని పొదల్లో బాలుడు వేసుకున్న చొక్కా, నిక్కర్ రక్తపు మరకలతో కనిపిం చాయి. అక్కడే ఎముకలు కూడా పడి ఉన్నాయి. దీంతో ఆ చిన్నారి కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగి గాలించినా తేజస్ మృతదేహం కనిపించలేదు. పైగా ఆ ప్రాంతంలో చిరుత అడుగులు కనిపించడంతో బాలుడిని అది తినేసి ఉంటుందని భావిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షల న ష్టపరిహారం చెల్లిస్తామని అటవీ అధికారి అప్పారావు హామీ ఇచ్చారు.