వైరల్‌గా మారిన మంచి మనిషి కథ
బీజింగ్: వృత్తి ఏదైనా ప్రవృత్తి ముఖ్యం. పెద్ద మనుసు ఉండాలిగానీ పేదలకు ఎలాగైనా సాయం చేయవచ్చు. అది చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని జియావోజువో అనే గ్రామం. అందులో వాంగ్ జెంగ్‌జియాన్ అనే వ్యక్తికి ఓ బార్బర్ షాపుంది. ప్రతి రోజు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు, అంటే రోజుకు 17 గంటలపాటు క్షణం తీరిక లేకుండా నిర్విరామంగా పనిచేస్తున్నారు. గత 25 ఏళ్లగా ఆయన ఇలాగే అలుపు సొలుపూ లేకుండా పనిచేస్తూ ఈ వృత్తిలోనే తృప్తి పొందుతున్నారు.
ఆయన బార్బర్ షాపుకు అంత ఎక్కువ గిరాకీ ఉండడానికి కారణం కటింగ్‌కు భారతీయ కరెన్సీలో కేవలం పది రూపాయలు మాత్రమే చార్జి చేయడం. అది కూడా ఇప్పుడు నిర్ణయించింది కాదు. తాను పాతికేళ్ల క్రితం ఈ వృత్తిలోకి ప్రవేశించినప్పుడు నిర్ణయించిన చార్జి. పాతికేళ్లలో కరెన్సీ విలువ ఎంతో మారినా, నిత్యావసర సరకుల ధరలు పెరిగినా ఆయన మాత్రం చార్జీనీ మార్చలేదు. పైగా పేదవాళ్లకు, దివ్యాంగులకు ఉచితంగా హేర్ కటింగ్ చేస్తున్నారు. తన షాపుకొచ్చి కూర్చోగలిగిన వారికి కుర్చీలో, అంత ఓపిక లేనివారికి చెట్టు కింద నీడలో, షాపు దగ్గరికి రాలేనివారికి ఎక్కడుంటే అక్కడే, ముఖ్యంగా దివ్యాంగులకు, మంచం పట్టిన రోగులకు ఇంటికెళ్లి మరీ కటింగ్ చేస్తున్నారు.
‘నేను గతంలో వాంగ్ షాపుకెళ్లి కటింగ్ చేయించుకునేవాణ్ని. గత కొంతకాలంగా అనారోగ్యం వల్ల మంచం పట్టాను. లేవలేకపోతున్నా. వాంగ్ రెగ్యులర్‌గా ఇంటికొచ్చి హేర్ కట్టింగ్, షేవింగ్ చేసి వెళుతున్నారు. నేను పేదవాడిని అవడం వల్ల నా దగ్గర డబ్బులు తీసుకోవడం లేదు. పది రూపాయలేగదా! ఇద్దామనుకుంటే, బాబాయ్! డబ్బులెవరికి కావాలి, ప్రేమకావాలిగానీ అంటూ ఆప్యాయంగా పలకరించి వెళతారు’ అని ఓ 80 ఏళ్ల కస్టమర్ వ్యాఖ్యానించారు. ఈ ప్రజా సేవ ఎలా అలవాటైందని వాంగ్‌ను ప్రశ్నించగా..
‘ఇది ధనిక గ్రామమేమి కాదు. గ్రామంలో అందరూ సమానస్థాయి వాళ్లు ఉండరు. పేదవాళ్లు ఉంటారు, డబ్బులున్నవాళ్లు ఉంటారు. వారి వారి అవసరాలను దృష్టి పెట్టుకొని మన బతుకుతెరువుకు సరిపడినంతా చార్జిచేస్తే చాలు. వృత్తిలో డబ్బులు సంపాదించడం ముఖ్యం కాదు. వృత్తిని చిత్తశుద్ధితో చేయడం ముఖ్యం’ అని నాకు ఈ విద్యను నేర్పిన గురువు చెప్పారని, ఆ గురువు మాటలు ఇప్పటికీ మరచిపోలేదని వాంగ్ స్థానిక మీడియోకు తెలిపారు. వాంగ్‌కు సంబంధించిన ఈ వార్త ఇప్పుడు చైనా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యూజర్లు వాంగ్ గొప్పగుణాన్ని ప్రశంసిస్తున్నారు.