అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ సమీపించే కొద్దీ రాష్ట్రంలో రాజకీయం గందరగోళంగా మారిపోతోంది.
చెన్నై, సాక్షి ప్రతినిధి: అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ సమీపించే కొద్దీ రాష్ట్రంలో రాజకీయం గందరగోళంగా మారిపోతోంది. పొత్తులపై ఒక కొలిక్కిరాలేని అన్ని పార్టీలూ సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చి తలా ఒక దిక్కున పరుగులు తీస్తున్నాయి. పొత్తుల ఊహలకు అందని రీతిలో బీజేపీ అగ్రనేత సుబ్రహ్మణ్యస్వామి తన ప్రకటనలతో కలవరం సృష్టించడం ప్రారంభించారు. డీఎంకే, డీఎండీకేలతో కూటమి ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నామని బీజేపీ అగ్రనేత సుబ్రహ్మణ్యస్వామి ప్రకటించి రాజకీయ జీవులను ఆశ్చర్యపరిచారు.
బీజేపీ కూటమిలోకి డీఎంకే, డీఎండీకేలను చేర్చేందుకు స్వామి శతవిధాల ప్రయత్నిస్తున్నారు. లౌకికవాద డీఎంకే మతతత్వవాద పార్టీగా ముద్రపడిన బీజేపీకి మధ్య పొత్తు ఎలా సాధ్యమని అందరూ విస్తుపోతున్నారు. బలమైన కూటమి కోసం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా శతవిధాల ప్రయత్నిస్తుండగా, డీఎంకేతో స్వామి చేస్తున్న చెలిమి ప్రయత్నాలు రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. అమిత్‌షా అదేశాల మేరకే స్వామి పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
అధికార అన్నాడీఎంకేకు బద్ధశత్రువైన డీఎండీకేతో పొత్తుకు సిద్ధం అంటూనే జయలలిత కోసం బీజేపీ ప్రయత్నాలు సాగిస్తోంది. మరో పదిరోజుల్లో కూటమిని ఖరారు చేస్తామని కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ శుక్రవారం ప్రకటించారు. బీజేపీ అధ్యక్షులు అమిత్‌షా, విజయకాంత్ మధ్య త్వరలో జరగాల్సిన చర్చలు వాయిదాపడ్డాయి. విజయకాంత్ మౌనం వల్లనే బీజేపీ వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు రాహుల్‌గాంధీ ఈనెల 10వ తేదీన రాష్ట్ర నేతలతో మరోసారి సమావేశం అవుతున్నారు.
ఎన్నికలు సమీపిస్తున్నా రాష్ట్ర అధ్యక్షులు ఈవీకేఎస్ ఇళంగోవన్‌కు ముఠాపోరు నుంచి విముక్తి లభించలేదు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు గతనెల ఢిల్లీకి పిలిపించుకున్న రాహుల్‌గాంధీ ఈనెల 10వ తేదీన మరోసారి సమావేశం అవుతున్నారు. కాంగ్రెస్ నేతలను బుజ్జగించే, భయపెట్టో కార్యోన్ముఖులను చేయడానికి రాహుల్ మరో ప్రయత్నం చేస్తున్నారు. అలాగే డీఎంకేతో పొత్తుకు దాదాపు సిద్దమైన కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించేందుకు సిద్దం కానుంది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి, నటి కుష్బును ఎన్నికల్లో పోటీచేయించాలని ఒక వర్గం గట్టి ప్రయత్నాలతో ఉంది.
డీఎంకే నుండి బైటకు వచ్చిన కుష్బు పోటీకి సిద్దమైతే, అదే కూటమిలో చేరనున్న డీఎంకే అంగీకరిస్తుందా అనే ప్రశ్న ఉదయిస్తుంది. కాగా, డీఎండీకేలో అభ్యర్దుల దరఖాస్తుల స్వీకరణను విజయకాంత్ శుక్రవారం ప్రారంభించారు.
దరఖాస్తుల స్వీకరణ, అప్పగింత ఈనెల 14వ తేదీ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. ఎన్నికల్లో ఎవరితో పొత్తుపెట్టుకోవాలనే అంశంపై డీఎండీకే అధ్యక్షులు విజయకాంత్ తన పార్టీ అనుచరులతో సమావేశమైనారు.
డీఎంకే, కాంగ్రెస్, బీజేపీ, ప్రజాస్వామ్య కూటమిల నుండి పొత్తుకు పిలుపురావడంతో ఏవైపు మొగ్గాలనే విషయంలో తలమునకలై ఉన్నారు. ఎవరికి మద్దతు ఇచ్చినా తనదే క్రియాశీలక పాత్ర ఉండాలని విజయకాంత్ ఆశిస్తున్నారు. అంతేగాక తమ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ముఖ్యమంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఈనెల 20వ తేదీన కాంచీపురంలో నిర్వహించే పార్టీ మహానాడులో పొత్తు ఖరారును ప్రకటిస్తానని విజయకాంత్ చెప్పారు. అన్నాడీఎంకేలో అభ్యర్దుల దరఖాస్తుల స్వీకరణతో శనివారంతో ముగుస్తుండగా, శుక్రవారం నాటికి 25వేల దరఖాస్తులు అందినట్లు సమాచారం.
ప్రజాస్వామ్య కూటిమిలో భాగస్వామిగా ఉన్న వీసీకే అధినేత తిరుమావళవన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్దిగా ప్రకటించాలనే డిమాండ్‌ను అరుంధీయులు లేవనెత్తారు. దళితుడైన తిరుమావళవన్‌ను సీఎం అభ్యర్దిగా ప్రకటిస్తే మెరుగైన ఫలితాలు ఖాయమని వారు వాదిస్తున్నారు. కరుణానిధి ఆరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని శుక్రవారం ఒక వివాహ వేడకకు హాజరైన డీఎంకే కోశాధికారి స్టాలిన్ విశ్వాసం వ్యక్తం చేశారు.