ఆందోళకారులు తగులబెట్టిన కారుపై మంటలార్పుతున్న దృశ్యం
ఇండోర్: మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ పట్టణంలోని చందన్ నగర్ ప్రాంతంలో ఓ ఆవు కళేబరం స్వాధీనం విషయమై రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదం మత ఘర్షణలకు దారితీసింది. ఈ ఘర్షణల్లో ఎస్పీ, అదనపు ఎస్పీ వంటి పోలీసు ఉన్నతాధికారులు సహా మొత్తం 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో జిల్లా అధికారులు చందన్ నగర్‌లో మంగళవారం కర్ఫ్యూ విధించారు.
ఓ ఆవు కళేబరం స్వాధీనం విషయమై ఓ మతానికి చెందిన ప్రజలు భారీ సంఖ్యలో రోడ్లపై గుమిగూడారు. ఈ సమయంలో మరో మతానికి చెందిన వ్యక్తులు వీరిపై రాళ్లు రువ్వడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ప్రారంభమైంది. దీంతో చందన్ నగర్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సమాచారం అందుకుని రంగంలోకి దిగిన పోలీసులపై ఇరు మతాలకు చెందిన ఆందోళన కారులు మూకుమ్మడిగా రాళ్లదాడి చేశారు.
ఈ దాడిలో ఎస్పీ, అదనపు ఎస్పీ సహా 20 మంది పోలీసులు, మరో ఐదుగురు స్థానికులు తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకుగాను పోలీసులు భాష్పవాయు గోళాలను వినియోగించి లాఠీ చార్జ్ చేశారు. మరోపక్క, అల్లర్లను అదుపు చేసేందుకుగాను జిల్లా మేజిస్ట్రేట్ కర్ఫ్యూ విధించారు.