
యాకూబ్ మెమన్‌కు ఉరిశిక్ష ఖాయం
1993 ముంబయి పేలుళ్ల కేసులో తొలి మరణశిక్ష
క్యూరేటివ్ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు; జూలై 30న ఉరి
న్యూఢిల్లీ: ముంబయిలో 1993 నాటి వరుస బాంబు పేలుళ్ల కేసులో నేరస్థుడు యాకూబ్ మెమన్ క్షమాభిక్ష పిటిషన్‌ను మంగళవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో అతని ఉరిశిక్ష అమలు ఖరారైనట్లయింది. మాఫియాడాన్ దావూద్ ఇబ్రహీంతో పాటు సహ కుట్రదారులుగా యాకూబ్ మెమన్ అతని సోదరుడు టైగర్ మెమన్‌లను న్యాయస్థానం నిర్ధారించి మరణ శిక్షను విధించింది. 1993 తరువాత టైగర్ దేశం విడిచి పారిపోయాడు. 1994లో నేపాల్ సరిహద్దులో యాకూబ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే తనకు మరణ శిక్ష నుంచి మినహాయింపునివ్వాల్సిందిగా యాకూబ్ మెమన్ సర్వోన్నత న్యాయస్థానంలో నిరుడు క్యూరేటివ్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం అతను పిటిషన్ లో పేర్కొన్న కారణాలు క్షమాభిక్షకు అర్హమైనవి కావని తేల్చిచెప్పింది. ఈ కేసులో మరణ శిక్ష అమలవుతున్న తొలి నేరస్థుడు మెమనే.
తాను 1996 నుంచి దాదాపు 20 ఏళ్లుగా జైల్లోనే మగ్గుతున్నానని, మనోవైకల్యంతో బాధపడుతున్నానని యాకూబ్ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఒక నేరస్థుడికి ఒక నేరంలో జీవితఖైదు, ఉరిశిక్ష రెండు శిక్షలు వేయజాలరని యాకూబ్ తరపు న్యాయవాదులు వాదించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు, జస్టిస్ టీఎస్ ఠాకూర్, ఏఆర్ దవేలతో కూడిన ధర్మాసనం ఈ వాదనలను కొట్టివేసింది. సుప్రీం తీర్పుతో జూలై 30న యాకూబ్ ఉరికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. నాగపూర్ సెంట్రల్ జైలులో కానీ, పూణె ఎఱవాడ జైలులో కానీ ఉరిశిక్ష అమలు చేయవచ్చని నాగపూర్ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ యోగేశ్ దేశాయ్ తెలిపారు.
చరిత్రాత్మకం: ఉజ్వల్ నికమ్
యాకూబ్ మెమన్ క్యూరేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించటం చరిత్రాత్మకమని ఈ కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరించిన న్యాయవాది ఉజ్వల్ నికమ్ అన్నారు. సుప్రీం తీర్పును శివసేన కూడా హర్షించింది. ఇదేకేసులో గతంలో అరెస్టయి ప్రస్తుతం సమాజ్‌వాదీ పార్టీ ఎంపీగా ఉన్న అబూ ఆజ్మీకూడా ఆహ్వానిస్తున్నానని అన్నారు.
గవర్నర్‌ను క్షమాభిక్ష కోరిన యాకూబ్
క్యూరేటివ్ పిటిషన్‌ను సుప్రీం తిరస్కరించటంతో తుది ప్రయత్నంగా మహారాష్ట్ర గవర్నర్‌ను క్షమాభిక్ష కోరుతూ యాకూబ్ మెర్సీ పిటిషన్ దాఖలు చేశారు. నాగపూర్ సెంట్రల్ జైలు అధికారులకు ఈ పిటిషన్‌ను అందజేశారు. తొలి క్షమాభిక్ష పిటిషన్‌ను యాకూబ్ సోదరుడు సులేమాన్ వేశారని, ఇప్పుడు యాకూబ్ స్వయంగా క్షమాభిక్ష కోరుతున్నందున రెండో క్షమాభిక్ష పిటిషన్ చెల్లుతుందని ఆయన లాయర్ అనిల్ గెడెమ్ తెలిపారు.
ముంబయి పేలుళ్ల కేసు పరిణామ క్రమం
1993 మార్చి 12: ముంబైలో 13 ప్రాంతాల్లో వరుస బాంబు పేలుళ్లు.. 257 మంది మృతి.. 713మందికి పైగా గాయాలు
1993 నవంబర్ 4: 189 మంది నిందితులపై దాదాపు 10వేల పేజీల చార్జిషీటు దాఖలు
1995 ఏప్రిల్ 10: 26మంది నిందితులను విడుదల చేసిన టాడా కోర్టు.
2001 జూలై18: 684మంది సాక్షుల స్టేట్‌మెంట్ల రికార్డు పూర్తి
2003 సెప్టెంబర్: పూర్తయిన విచారణ.. రిజర్వులో తీర్పు
2006 సెప్టెంబర్ 12: తీర్పు వెల్లడి. యాకూబ్ మెమన్‌తో సహా అతని నలుగురు కుటుంబ సభ్యులు దోషులుగా ఖరారు. యాకూబ్ సహా 12మంది నిందితులకు మరణ శిక్ష. మరో 20మందికి జీవిత ఖైదు.
2013 మార్చి 21:యాకూబ్ ఉరిశిక్షను సుప్రీం కోర్టు కూడా సమర్థించింది.
2014 మే: యాకూబ్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ప్రణబ్ తిరస్కరించారు.
2014 జూన్ 2: సుప్రీంలో క్యూరేటివ్ పిటిషన్‌ను వేసిన యాకూబ్
2015 జూలై 21: క్యూరేటివ్ పిటిషన్ కొట్టివేత