యూపీఏ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఆహారభద్రత బిల్లు సహా పలు కీలకమైన బిల్లులు ఆమోదం పొందాల్సి ఉండటం, మరోవైపు తెలంగాణ, ఇతర అంశాల కారణంగా పార్లమెంటు ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడంతో ఎంపీలందరికీ కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసింది. సోమవారం నుంచి వరుసగా వారం రోజుల పాటు పార్టీ ఎంపీలందరూ తప్పనిసరిగా సభలోనే ఉండాలంటూ మూడు వాక్యాలతో కూడిన విప్ను జారీ చేసింది. సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో సభలో ఉండటమే కాక, ప్రభుత్వానికి అన్ని రకాలుగా సాయపడాలని కూడా అందులో తెలిపారు. జన్మాష్టమి సందర్భంగా పార్లమెంటుకు బుధవారం సెలవు.
లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఆహార భద్రతా బిల్లు ఆమోదానికి కాంగ్రెస్ పార్టీ నానా తంటాలు పడుతోంది. ఈ బిల్లు సోమవారమే చర్చకు రానుంది. రాష్ట్రానికి చెందిన 12 మంది సీమాంధ్ర ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేయడంతో, ఇక సోమవారం నుంచి రాష్ట్ర విభజన అంశం సభను ఇబ్బంది పెట్టకపోవచ్చని కాంగ్రెస్ పార్టీ ఆశాభావంలో ఉంది. శనివారం మూడు బిల్లులను ఆమోదించారు. ఈవారంలో ఆహార భద్రతా బిల్లుతో పాటు భూసేకరణ బిల్లు కూడా చర్చకు రానుంది. ఈ రెండు బిల్లలు వచ్చే ఎన్నికల్లో తమకు బాగా ఉపయోగపడతాయని కాంగ్రెస్ భావిస్తోంది.
ఆహార భద్రతాబిల్లుకు పలు పార్టీలు అనేక సవరణలు సూచించడంతో ఇక మరే పార్టీ ఈ బిల్లుకు అడ్డం చెప్పబోదని కాంగ్రెస్ నాయకులు అనుకుంటున్నారు. ఈ సమావేశాలకు భారీ ఎజెండా ఉండటంతో, సమావేశాలను సెప్టెంబర్ ఐదో తేదీ వరకు పొడిగిస్తారని భావిస్తున్నారు.
కీలక బిల్లలు కోసం ఎంపీలకు విప్ జారీ చేసిన కాంగ్రెస్ పార్టీ
Published Sun, Aug 25 2013 1:38 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement