
ఆయనే రాష్ట్రపతి కావాలి: ప్రధానికి లేఖ
బెంగళూరు: పార్టీ వైఖరికి భిన్నంగా రాష్ట్రపతి పదవి రేసులో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌కు కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రైల్వే మంత్రి జఫర్ షరీఫ్ మద్దతు పలికారు. భగవత్‌ను రాష్ట్రపతి చేయాలంటూ ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆయన లేఖ రాశారు. మోహన్ భగవత్ దేశభక్తి విషయంలో ఎవరికీ సందేహాలు లేవని లేఖలో పేర్కొన్నారు.
'భారత్‌లోనే అనేక భావజాలాలు ఉన్నాయి. విశాలమైన ఒక దేశంలో అలాంటి విభిన్న భావజాలాలు ఉండటం సహజమే. మోహన్ భగవత్ ఒక భావజాలానికి చెందిన వ్యక్తి కావొచ్చు. కానీ ఆయన దేశభక్తిని, భారత ప్రజల పట్ల ఆయన ప్రేమను, దేశంపై ఆయనకున్న విధేయతను ఎవరూ తప్పుబట్టలేరు' అని షరీఫ్ తన లేఖలో పేర్కొన్నారు.
అయితే, మోహన్ భగవత్‌ను రాష్ట్రపతి చేయాలన్న ఎలాంటి చర్యనైనా తాము నిర్ద్వంద్వంగా అడ్డుకుంటామని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే స్పష్టం చేసింది. ఆరెస్సెస్ భావజాలానికి తాము ఎంతమాత్రం మద్దతు తెలుపబోమని పేర్కొంది.