న్యూఢిల్లీ/భోపాల్: లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయదుందుభి మోగించనున్నట్లు ఎగ్జిట్‌పోల్స్‌లో వెల్లడించడాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోంది. ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలను చెత్తగా అభివర్ణించింది. వాటి ప్రామాణికతను ప్రశ్నించింది. అయితే కాంగ్రెస్‌లో నిరాశకు ఇది నిదర్శనమని బీజేపీ ఎగతాళి చేసింది.ఎగ్జిట్‌పోల్స్‌లో బీజేపీ మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో విజయం సాధిస్తుందని, ఢిల్లీలో ఆధిక్యంలో నిలుస్తుందని పేర్కొనడం తెలిసిందే. ఎగ్జిట్‌పోల్స్ ప్రామాణికతను ఆమోదించేందుకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ తిరస్కరించారు.
అలాగే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ ఎదుగుదలకు రుజువుగా నిలుస్తాయన్న వాదననూ తోసిపుచ్చారు. ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలను డస్ట్‌బిన్‌లో పడేయాలని ఆయన వ్యాఖ్యానించారు. కాగా రాహుల్‌గాంధీ ఛత్తీస్‌గఢ్‌కు చెందిన పార్టీ నేతలతో సమావేశమవగా.. రాష్ట్రంలో బీజేపీ నుంచి అధికారాన్ని చేజిక్కించుకోవడం ఖాయమన్న ఆశాభావం వ్యక్తమైనట్టు పార్టీ ప్రతినిధి భక్తచరణ్‌దాస్ తెలిపారు.