అనుమానస్సదస్తితిలో దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గ్రేటర్ నోయిడాలోని ధన్ కౌర్ ప్రాంతంలో సోమవారం చోటుచేసుకుంది.
గ్రేటర్ నోయిడా: అనుమానస్పదస్తితిలో దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గ్రేటర్ నోయిడాలోని ధన్ కౌర్ ప్రాంతంలో సోమవారం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. భార్య మృతదేహం ఫ్యాన్ కు వేలాడుతుంటే, భర్త మృతదేహం తలకు బుల్లెట్ గాయంతో నేలపై పడిఉందని ధన్ కౌర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్ఓ శైలేంద్ర ప్రతాప్ సింగ్ పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు సింగ్ చెప్పారు.
అయితే ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. వినోద్ ఒక రైతు. మద్యంకు బానిసైన వినోద్ తరుచూ భార్య రంజనాతో గొడవపడుతుండేవాడు. కుటుంబ పోషణ కోసం దాచిన డబ్బులను తన తాగుడుకు ఇవ్వాల్సిందిగా వినోద్ భార్యను వేధించసాగాడు. అందుకు ఆమె నిరాకరించడంతో భార్యను కొట్టాడు. వారిద్దరి మధ్య వాదనలు తీవ్రస్థాయికి చేరుకోవడంతో భార్య రంజన ఫ్యాన్ కు ఉరివేసుకోగా, భర్త వినోద్ తుపాకీతో తలపై కాల్చుకున్నట్టుగా ఈ ఘటన కనిపిస్తోంది.
కాగా, మృతదేహాలను శవపరీక్ష జరిపేందుకు మార్చూరీకి తరలించినట్టు సింగ్ తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్య, లేక ఆత్మహత్య అన్న మరోకోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు సింగ్ చెప్పారు.