
కోట్ల విలువైన బంగారాన్ని దోచేశారు
లక్నో: కోట్లాది రూపాయిల విలువైన బంగార బిస్కెట్లు, నగలు తీసుకు వెళ్తున్న ఓ కొరియర్ వాహనాన్ని అడ్డుకున్న దుండగులు... వాహన డ్రైవర్, సెక్యూరిటీ గార్డుపై విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ మరణించగా... సెక్యూరిటీ గార్డు మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అనంతరం దుండగులు వాహనంలోని బంగారం, నగదు తీసుకుని పరారైయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ ఉన్నవ్ జిల్లాలో లక్నో - కాన్పూర్ జాతీయ రహదారి పక్కనే ఉన్న బజీహెరా గ్రామం సమీపంలోని ఎఫ్ఐ మెడికల్ అండ్ రీసెర్చి సెంటర్ వద్ద చోటు చేసుకుంది.
ఈ ఘటనపై వాహనంలోని ఓ వ్యక్తి మాత్రం పోలీసులకు సమాచారం అందించాడు. దాంతో పోలీసులు ఘటన స్థలానికి డ్రైవర్, సెక్యూరిటీ గార్డును సమీపంలోని నవాబ్ జంగ్ కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే అప్పటికే డ్రైవర్ మృతి చెందాడని వైద్యులు తెలిపారు. గార్డు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని... అయితే అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. దాంతో మెరుగైన వైద్య చికిత్స కోసం అతడిని లక్నోలోని ట్రూమా సెంటర్కు తరలించారు
ఈ వాహనం సీక్వెల్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిందని పోలీసులు చెప్పారు. వ్యాన్లో నగదు అంతా బంగారం బిస్కెట్లు... నగల రూపంలో ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితల కోసం గాలింపు చర్యల కోసం చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.