ఒవైసీకి కోర్టు సమన్లు
మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీకి బిహార్లోని వైశాలి కోర్టు సమన్లు జారీ చేసింది. ఆగస్టు 11వ తేదీన స్వయంగా కోర్టుకు వచ్చి హాజరు కావాలని ఆదేశించింది. ముంబై పేలుళ్ల నిందితుడు యాకూబ్ మెమన్కు ఉరిశిక్ష విధించడంపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నమోదైన కేసు విచారణలో కోర్టు ఈ ఆదేశాలిచ్చింది. ఆరోజున కేసు విచారణ ఉంటుందని, దానికి ఒవైసీ స్వయంగా రావలని సబ్ డివిజనల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ రాజేష్ పాండే ఆదేశించారు.
హాజీపూర్కు చెందిన న్యాయవాది రాజీవ్ కుమార్ శర్మ గత సంవత్సరం జూలై 31న ఒవైసీ వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. యాకూబ్ మెమన్కు ఉరిశిక్ష వేయడాన్ని ఒవైసీ నిరసించారని, దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకులకు, 2002 గుజరాత్ అల్లర్లలో దోషులకు ఎందుకు ఉరిశిక్ష వేయలేదంటూ వాదించారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో వర్గాలు, జాతుల మధ్య విద్వేషాలు రేకెత్తించేలా ఒవైసీ వ్యాఖ్యలు ఉన్నాయని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన కోర్టు.. సమన్లు జారీ చేసింది.