న్యూఢిల్లీ: తన వద్ద బలవంతంగా డబ్బు గుంజేందుకు ఓ మహిళ తనపై తప్పుడు కేసు పెట్టిందని ఆరోపిస్తూ ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని నగర కోర్టు పోలీసులను ఆదేశించింది. ఢిల్లీకి చెందిన ఫార్మాసిస్టు నవీన్‌కుమార్ చేసిన ఫిర్యాదుపై చీఫ్ మెట్రొపాలిటన్ మేజిస్ట్రేట్ సోను అగ్నిహోత్రి పై ఆదేశాలు జారీ చేశారు. గత ఏడాది మార్చి 30న రాత్రి ఓ మహిళ తనను భయపెట్టి తన వద్ద బంగారు గొలుసును, రూ.5వేల నగదును లాగేసుకుందని నవీన్ కోర్టుకు ఫిర్యాదు చేశారు. ఆ తరువాత మరింత డబ్బు గుంజేందుకు తనపై తప్పుడు కేసు బనాయించిందని ఆరోపించారు. ఈ ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోర్టు కల్యాణ్‌పురీ స్టేషన్ అధికారిని ఆదేశించింది.
ఆ మహిళ ఇప్పటికే అత్యాచారం, వేధింపులకు సంబంధించి వేర్వేరు వ్యక్తులపై పది కేసులు పెట్టిందని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఇదిలా ఉండగా, నవీన్ చేసిన ఫిర్యాదుపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని మేజిస్ట్రేట్ ఆదేశించారు.