30 ఏళ్లుగా ఏం చేశారు?
న్యూఢిల్లీ: సరైన పత్రాలు లేవంటూ 30 ఏళ్ల కిందటి కేసును ముగించడానికి తాజాగా నివేదిక సమర్పించిన సీబీఐని ఢిల్లీ ప్రత్యేక కోర్టు తప్పుబట్టింది. ఆ నివేదికను ఆమోదిస్తూనే.. ఈ కేసులో తీవ్ర జాప్యం జరగడానికి బాధ్యులైన అధికారులెవరో తేల్చాలని సీబీఐ డెరైక్టర్‌ని ఆదేశించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న నలుగురిలో ముగ్గురు ఇప్పటికే చనిపోవడం, మరో వ్యక్తి వయసు ప్రస్తుతం 92 ఏళ్లుకావడంతో విధిలేని పరిస్థితుల్లో సీబీఐ విచారణను ముగించడానికి అంగీకరిస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. పైగా కేసుకు సంబంధించిన పత్రాలు అందుబాటులో లేవన్న విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు పేర్కొంది. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీకి చెందిన ముగ్గురు అధికారులతో కుమ్మక్కై డి.ఎన్. సర్కార్ అనే వ్యక్తి మోసానికి పాల్పడి తప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్నట్లు 1984లో కేసు నమోదైంది.
జపాన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణం సందర్భంగా గాలి ఒత్తిడిలో తేడా వల్ల తన ఎడమ చెవి కర్ణభేరి దెబ్బతిని చెవుడు వచ్చిందని పేర్కొంటూ అందుకు పరిహారంగా సర్కార్ ఇన్సూరెన్స్ పొందారు. ఈ వ్యవహారాన్ని దర్యాప్తు చేసిన సీబీఐ మొదట సర్కార్ క్లెయిమ్‌ని సమర్థిస్తూ కోర్టుకు నివేదించింది. అయితే సీబీఐ తగినన్ని ఆధారాలు సేకరించలేదని భావించిన జడ్జి.. మరింత లోతుగా దర్యాప్తు చేయాలని 1985లో ఆదేశించారు. కానీ ఇంతకాలం తాత్సారం చేసిన సీబీఐ.. కేసుకు సంబంధించిన పత్రాలు లభించడం లేదంటూ దర్యాప్తు ముగింపు నివేదికను తాజాగా కోర్టుకు సమర్పించడం గమనార్హం.