భువీలాంటి బౌలర్ ఉండటం మా అదృష్టం!
హైదరాబాద్: బౌలర్ భువనేశ్వర్ కుమార్ మెరుపు బౌలింగ్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు.. అపూర్వమైన విజయాన్ని సొంతం చేసుకుంది. భువీ 19 పరుగులకు ఐదు వికెట్లు తీయడంతో సొంత గడ్డపై పంజాబ్ జట్టును చిత్తుచేసింది. నిజానికి పంజాబ్ ఆటగాడు మనన్ వోహ్రా అద్భుతంగా ఆడి 50 బంతుల్లోనే 95 పరుగులు చేశాడు. దీంతో 160 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా పంజాబ్ అందుకుంటుందని అంతా భావించారు. కానీ భువీ మెరుపులతో పంజాబ్ లక్ష్యానికి ఐదు పరుగుల దూరంలో ఆగిపోయింది. సన్‌రైజర్స్ జట్టును అద్భుతమైన విజయం వరించింది.
గొప్పగా రాణించిన భువీని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది. మ్యాచ్ అనంతరం అతడు మాట్లాడుతూ.. నా హృదయం ఇప్పటికీ ఉప్పొంగుతోంది. ఊహించలేనిది జరగడమే టీ-20 గేమ్ గొప్పతనం. సన్‌రైజర్స్ జట్టు కోసం నా శాయశక్తులా కృషి చేస్తున్నా. 19వ ఓవర్ నేనే బౌలింగ్ చేయాల్సి ఉంటుందని తెలుసు. అప్పటికే పంజాబ్ బ్యాట్స్‌మెన్ బాగా ఆడుతున్నారు. అయినా నేను ఆందోళన చెందలేదు. కెప్టెన్ వార్నర్‌తో చర్చించాను. స్ట్రయిట్ యార్కర్లు వేయాలని ఇద్దరం ప్లాన్‌చేశాం. అదే అమలు చేశా. ఫలితం వచ్చింది’ అని చెప్పాడు. ఇక సన్‌రైజర్స్ సారథి డేవిడ్ వార్నర్ మాట్లాడుతూ.. భువీ లాంటి బౌలర్ జట్టుకు ఉండటం అదృష్టమని చెప్పాడు. ఇటు మనన్, అటు భువీ అద్భుతంగా ఆడారని ప్రశంసించాడు.