100 శాతానికి చేరిన డీఏ | Dearness allowance hiked by 10 percent | Sakshi
Sakshi News home page

100 శాతానికి చేరిన డీఏ

Published Sat, Mar 1 2014 12:15 AM | Last Updated on Sat, Sep 2 2017 4:12 AM

100 శాతానికి చేరిన డీఏ

100 శాతానికి చేరిన డీఏ

కేంద్ర ప్రభుత్వోద్యోగులకు 10 % డీఏ పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం
 
 న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వోద్యోగులకు 10 శాతం కరువు భత్యం (డీఏ) ఇవ్వాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ శుక్రవారం ఆమోదముద్ర వేసింది. దీంతోపాటు ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఏడో వేతన సవరణ సంఘాని (పీఆర్సీకి)కి మార్గదర్శకాలను, విధి విధానాలను ఖరారు చేసింది. ఉద్యోగుల కనీస పింఛనును రూ. 1,000కి పెంచడం, సబ్సిడీ సిలిండర్లను నెలకు ఒకటికంటే ఎక్కువగా పొందడానికి అవకాశం కల్పించడం వంటి పలు అంశాలకు ఆమోదం తెలిపింది. మరికొద్ది రోజుల్లో సాధారణ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో... ఈ కీలక నిర్ణయాలను కేంద్ర కేబినెట్ ఆమోదించడం గమనార్హం.
 డీఏ పెంపు 2014 జనవరి 1 నుంచే...
 
 ప్రస్తుతం 10 శాతం పెంపుతో.. కేంద్ర ఉద్యోగులకు ఇప్పటివరకూ 90 శాతంగా ఉన్న డీఏ 100 శాతానికి చేరుకుంది.
 ఇది దేశవ్యాప్తంగా దాదాపు 50 లక్షల మంది ఉద్యోగులు, 30 లక్షల మంది పెన్షనర్లకు లాభం చేకూర్చనుంది.
 దీనిని 2014 జనవరి 1 నుంచే అమలు చేయనున్నారు. అయితే, ఉద్యోగులకు మాత్రం నగదు రూపేణా మార్చి నుంచి (ఏప్రిల్‌లో చెల్లించే వేతనంతో) చెల్లిస్తారు. పింఛన్‌దారులకు బకాయితో సహా మొత్తాన్నీ చెల్లిస్తారు.
 
 దీనివల్ల 2015 ఫిబ్రవరి వరకు కేంద్ర ఖజానాపై రూ. 12,920 కోట్ల అదనపు భారం పడనుంది.
 ఏడో వేతన సంఘానికి మార్గదర్శకాలు..
 
 ఉద్యోగుల వేతన సవరణ కోసం ఏడో వేతన సంఘానికి మార్గదర్శకాలు, విధి విధానాలను కేబినెట్ ఖరారు చేసింది.
     
 సుప్రీం మాజీ న్యాయమూర్తి జస్టిస్ అశోక్‌కుమార్ మాథుర్ ఆధ్వర్యంలోని ఈ కమిషన్... ఏర్పాటు చేసిన తేదీ నుంచి 18 నెలల్లో నివేదిక ఇవ్వాలి.
 
 దేశంలోని ఆర్థిక పరిస్థితులు, వనరుల ఆధారంగా... వేతనాలు, పింఛన్లు, ఇతర అలవెన్సుల సవరణను సూచించాలని విజ్ఞప్తి చేసింది.
 
 ఆలోగా 50 శాతం డీఏను మూలవేతనంలో కలిపేదిశగా మధ్యంతర ప్రతిపాదనలను వేతన సంఘం చేసే అవకాశముంది.
 
 50 శాతం డీఏను మూలవేతనంలో కలిపితే... కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అందుకునే వేతనాలు 30 శాతం వరకూ పెరుగుతాయి.
 
 నెలకు ఒకటి కంటే ఎక్కువ...
 
 సబ్సిడీపై అందించే సిలిండర్ల సంఖ్యను ఏడాదికి 12కు పెంచిన కేంద్రం.. తాజాగా వాటిని నెలకు ఒకటికన్నా ఎక్కువ  సిలిండర్లను వినియోగించేందుకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
 వినియోగదారులు ఒక సిలిండర్ తీసుకున్న 21 రోజుల తర్వాత మరో సబ్సిడీ సిలిండర్‌ను పొందవచ్చు.
 
 టన్ను యూరియాపై రూ. 350 పెంపు..
 
 యూరియా ధరను టన్నుకు రూ. 350 పెంచుతూ.. కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో యూరియా ఫిక్స్‌డ్ ధర టన్ను రూ 2,300కు చేరుతోంది.
 
 దీంతోపాటు 30 ఏళ్ల కిందటి యూరియా ప్లాంట్లకు టన్నుకు మరో రూ. 150ను అదనంగా ఇస్తారు.
 గిరిజనులకు 150 రోజులు ‘ఉపాధి’..
 
 జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఏ) కింద గిరిజన కుటుంబాలకు ఏడాదిలో 150 రోజుల పాటు పని కల్పించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
 
 ఏప్రిల్ ఒకటోతేదీ నుంచి ఇది అమల్లోకి రానుంది.
 
 అటవీ హక్కుల చట్టం కింద భూమి హక్కులు పొందిన.. దాదాపు 14 లక్షల మంది గిరిజనులకు ఇది ప్రయోజనం కల్పించనుంది.
 వీరు తొలుత వందరోజుల పని పూర్తిచేసుకోగానే.. మరో రంగులో ఉండే జాబ్‌కార్డును అందజేసి, అదనపు పని కల్పిస్తారు.
 
 కేబినెట్ ఇతర నిర్ణయాలు
 
 12వ పంచవర్ష ప్రణాళిక కాలంలో నూతనంగా 54 కేంద్రీయ విద్యాలయాలు, 3,500 మోడల్ పాఠశాలల స్థాపనకు ఓకే చెప్పింది.
 
 ఈ ప్రణాళిక కాలంలో సమగ్ర శిశు రక్షణ పథకం (ఐసీపీఎస్) కొనసాగింపునకు రూ. 3,000.33 కోట్లు కేటాయించింది. పథకంలో నిర్మాణాలకు సంబంధించి చదరపు అడుగుకు రూ. 600 నుంచి రూ. 1,000 పెంచింది.
 
 అంధ విద్యార్థులు వినియోగించగలిగే మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు సమకూర్చడానికి పచ్చజెండా ఊపింది. వికలాంగులు తమ పరికరాల కొనుగోలులో మరింత రాయితీ పొందేందుకు వీలుగా ఆదా య పరిమితిని పెంచడానికి కూడా కేబినెట్ అంగీకరించింది. ఇవి ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి.
 
 ఆరోగ్య పరిశోధనలో మానవ వనరుల అభివృద్ధి పథకానికి వచ్చే పంచవర్ష ప్రణాళిక అంచనావ్యయం రూ. 597 కోట్లకు ఆమోదం తెలిపింది.
 
 ప్రసారభారతికి మౌలిక సదుపాయాల కల్పన, నెట్‌వర్క్‌నకు రూ. 3,500 కోట్ల కేటాయింపునకు అనుమతిచ్చింది.
 
 ఎన్నికల ఖర్చు
 పెంపునకు అనుమతి
 వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచారం ఖర్చు పెంపు పరిమితులపై ఎన్నికల సంఘం ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ అంగీకారం తెలిపింది. పెద్ద రాష్ట్రాల్లోని లోక్‌సభ నియోజకవర్గాల్లో అభ్యర్థుల గరిష్ట పరిమితిని రూ. 70 లక్షలుగా, చిన్న రాష్ట్రాల్లో రూ. 54 లక్షలుగా చేయాలని ఇటీవల ఈసీ కోరింది. అలాగే పెద్ద రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఖర్చు గరిష్ట పరిమితిని 28 లక్షలు, ఈశాన్య రాష్ట్రాలు, గోవా, పాండిచ్చేరిల్లో రూ. 20 లక్షలుగా చేయాలని ఈసీ నివేదించింది. ఓటర్లు, పోలింగ్ స్టేషన్లు, ద్రవ్యోల్బణ సూచీని దృష్టిలో ఉంచుకుని గతంలో ఉన్న లోక్‌సభ అభ్యర్థుల గరిష్ట పరిమితిని రూ. 40 లక్షల నుంచి రూ. 70 లక్షలకు, గోవా, ఈశాన్య రాష్ట్రాలు, పర్వతప్రాంతాలతో పాటు ఇతర కేంద్ర పాలిత ప్రాంతాల్లో గతంలో నియోజకవర్గాలను బట్టి ఉన్న రూ. 27 లక్షల నుంచి రూ. 37 లక్షలు పరిమితిని రూ. 54 లక్షలకు పెంచుతూ  1961 ఎన్నికల నిబంధనలకు సవరణలు చేశారు.
 
 కనీస పింఛన్ రూ.వెయ్యికి పెంపు
 ఉద్యోగుల పింఛన్ పథకం (ఈపీఎస్-95) కింద పదవీవిరమణ పొందిన ప్రైవేటు ఉద్యోగులు నెలనెలా అందుకునే కనీస పింఛన్‌ను రూ. 1,000కి పెంచే ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది. ప్రైవేటు రంగంలో పనిచేసి రిటైరైన ఈపీఎఫ్ చందాదారులందరికీ ఇది వర్తిస్తుంది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ పెంపు కోసం కేంద్రం ఈపీఎఫ్‌వోకు రూ. 1,217 కోట్లను చెల్లించనుంది. దీంతో 5 లక్షల మంది వితంతువులు సహా.. 28 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటివరకూ కనీస పెన్షన్ ఏదీ లేకపోవడం, చాలా మంది రిటైరైన ప్రైవేటు ఉద్యోగులు పెన్షన్ కింద నెలకు అతితక్కువగా రూ. 200 కూడా అందుకుంటున్న పరిస్థితులన్న నేపథ్యంలో కనీస పెన్షన్‌ను వెయ్యికి పెంచారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement