అమ్మ వారసురాలిని ముమ్మాటికీ నేనే!
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత వారసురాలిని తానేనని, అమ్మ తరఫున తాను రాజకీయాల్లోకి వస్తానని ఆమె మేనకోడలు దీప ప్రకటించారు. జయలలిత నియోజకవర్గమైన ఆర్కే నగర్ ఉప ఎన్నికలో తాను పోటీచేస్తానని ప్రకటించారు. అమ్మ వారసురాలిగా రాజకీయాల్లోకి వస్తానని, త్వరలోనే కొత్త పార్టీ పెడతానని తెలిపారు. తన కొత్త పార్టీ వివరాలు ఈ నెల 24న ప్రకటిస్తానన్నారు. జయలలిత ఆశయసాధన కోసం తాను పోరాడుతానని చెప్పారు. శశికళ ముఖ్యమంత్రి కావాలనుకోవడం బాధాకరమని, దీనిని తమిళ ప్రజలు ఎంతమాత్రం కోరుకోవడం లేదని పేర్కొన్నారు.
అదే సమయంలో జయలలిత మృతిపైనా ఆమె అనుమానాలు వ్యక్తం చేశారు. జయలలితకు అందించిన చికిత్స రికార్డులన్నింటినీ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అమ్మ మృతిపై అపోలో వైద్యులు ఇచ్చిన వివరణ సరిపోదని, ఇంకా చాలా అనుమానాలకు సమాధానం రావాల్సి ఉందని వ్యాఖ్యానించారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. జయలలిత ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. ఆమెను కలిసేందుకు తనను అనుమతించలేదని గుర్తుచేశారు.