చిన్నమ్మ సీఎం కాకుండా ఆపేందుకే..!
చెన్నై: తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కిన నేపథ్యంలో డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ తనదైన స్టైల్‌లో పావులు కదుపుతున్నారు. అన్నాడీఎంకే అధినేత్రి వీకే శశికళ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకునేందుకు రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా ఆయన ఢిల్లీ పర్యటన చేపట్టే అవకాశముందని తెలుస్తోంది. ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి.. రాష్ట్రంలోని పరిస్థితులను వివరిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
శశికళ నిందితురాలిగా ఉన్న అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించేవరకు ఆమె ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవాలని రాష్ట్రపతి ప్రణబ్‌ను స్టాలిన్ కోరే అవకాశముందని తెలుస్తోంది. ఇప్పటికే తమిళనాడులో పరిస్థితులు స్థిరంగా లేవని, ఈ నేపథ్యంలో శశికళ ముఖ్యమంత్రి అయిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పు ప్రతికూలంగా వస్తే.. రాష్ట్రంలో పరిస్థితులు ఇంకా దిగజారుతాయని, ఈ నేపథ్యంలో చిన్నమ్మ సీఎం కాకుండా అడ్డుకోవాలని ఆయన కోరనున్నట్టు సమాచారం. మంగళవారం రాత్రికల్లా స్టాలిన్ ఢిల్లీ చేరుకునే అవకాశముందని తెలుస్తోంది.
చిన్నమ్మ శశికళను అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ప్రమాణస్వీకారానికి సిద్ధమవుతుండగా.. ఆమె ప్రమాణాన్ని అడ్డుకోవాలని ఇప్పటికే సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. దీంతో చిన్నమ్మ ప్రమాణం అనిశ్చితిలో పడింది.