జయలలిత ఆస్తులు నాకే దక్కాలి!
- పోయెస్ గార్డెన్ వద్ద హైడ్రామా
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసమున్న పోయెస్ గార్డెన్ వద్ద ఆదివారం హైడ్రామా నెలకొంది. జయలలిత మేనకోడలు దీప అనూహ్యంగా పోయెస్‌గార్డెన్ వద్ద ప్రత్యక్షమై.. అక్కడ ఉన్న జయ నివాసం ‘వేదవల్లి’లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు ఆమెను అడ్డుకోవడంతో ఇక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జయ నివాసంలోకి వెళ్లకుండా తనను అడ్డుకున్న పోలీసులతో దీప వాగ్వాదానికి దిగారు.
జయలలితకు అధికారికంగా వారసులు లేకపోవడంతో ఆమె ఆస్తులు ప్రస్తుతం ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. పోయెస్ గార్డెన్‌లోని ఆమె ‘వేదవల్లి’ నివాసం కూడా సర్కారు అధీనంలోనే ఉంది. అయితే, ఈ నివాసాన్ని తాను స్వాధీనం చేసుకుంటానని, తనను నివాసంలో ఉండేందుకు అనుమతించాలంటూ దీప ఆదివారం హల్‌చల్ చేశారు. తన అనుచరులతో వచ్చి నివాసంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీనిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. జయలలిత ఆస్తులు తమకే దక్కాలని, జయలలిత వారసులను ఇంటిలోకి వెళ్లకుండా అనుమతించడం సరికాదని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు.