కేంద్రమంత్రి ఉమాభారతికి అరెస్టు వారెంట్, స్టే
Published Thu, Sep 29 2016 6:04 PM | Last Updated on Tue, Aug 14 2018 3:55 PM
భోపాల్: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నాయకురాలు, కేంద్రమంత్రి ఉమాభారతిపై గురువారం మధ్యప్రదేశ్ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ వేసిన పరువునష్టం దావా కేసులో స్టేట్ మెంట్ ఇవ్వడంలో ఉమా జాప్యం చేస్తున్న నేపథ్యంలో కోర్టు తొలుత ఆమెకు వారెంట్ ను ఇచ్చింది. తర్వాత కేసులో ఉమాభారతికి ఇచ్చిన వారెంట్ పై స్టే విధించినట్లు పేర్కొంది.
అక్టోబర్ 19న కేసు మరోసారి విచారణకు రానుండటంతో ఉమ ఖచ్చితంగా కోర్టుకు హజరయ్యేలా చూడాలని సీనియర్ సూపరింటెండ్ ఆఫ్ పోలీస్(ఎస్ఎస్పీ)కు కేసు విచారించిన న్యాయమూర్తులు ఆదేశాలు ఇచ్చారు. 2003లో మధ్యప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా 10ఏళ్ల పాటు పనిచేసిన దిగ్విజయ్ సింగ్ హయాంలో రూ.15వేల కోట్ల అవినీతి జరిగిందని ఉమా భారతి స్టేట్ మెంట్ ఇచ్చారు.
దాంతో దిగ్విజయ్ గత ఏడాది మార్చిలో ఉమా భారతిపై పరువునష్టం దావా వేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ కేసుపై మధ్యప్రదేశ్ న్యాయస్ధానంలో పలుమార్లు విచారణ జరిగింది. ఈ ఏడాది ఇరువర్గాల మధ్య రాజీ కుదుర్చుకోవడానికి అవకాశం ఇవ్వాలని ఉమాభారతి తరఫు న్యాయవాది కోర్టును కోరారు. రాజీకి దరఖాస్తు చేసుకుని కూడా ఉమ ఈ ఏడాది ఫిబ్రవరి 5న జరిగిన కోర్టు విచారణకు హాజరుకాలేదు.
దీంతో గత ఏడాదిగా కేసు విచారణకు ఉమా హాజరుకాకపోవడాన్ని కోర్టు సీరియస్ గా తీసుకుంది. కాగా, ఈ కేసులో దిగ్వజయ్ సింగ్ ఇప్పటికే కోర్టులో తన వాంగ్మూలాన్ని సమర్పించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేశానట్లు కోర్టులో ఒప్పుకుంటే కేసును వెనక్కుతీసుకుంటానని కూడా దిగ్విజయ్ ప్రకటించారు.
Advertisement
Advertisement