'రామ్లీలా' విడుదలపై ఢిల్లీ కోర్టు నిషేధం
న్యూఢిల్లీ: ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించిన 'రామ్లీలా' సినిమా విడుదలపై ఢిల్లీ కోర్టు నిషేధం విధించింది. తదుపరి ఆదేశాలు వెలువరించే వరకు సినిమా విడుదల చేయొద్దని ఆదేశించింది. ఆ సినిమా హిందువుల మత మనోభావాలను దెబ్బతీసేదిగా ఉందని ప్రభు సమాజ్ ధార్మిక్ రామ్ లీలా కమిటీ సహా ఆరు కక్షిదారులు వేసిన దావాను విచారణకు అదనపు జిల్లా కోర్టు స్వీకరించింది. ఈ సినిమాలో మితిమీరిన శృంగారం, హింస, అసభ్యత ఉందని పిటిషనర్లు పేర్కొన్నారు.
హిందువుల దైవమైన శ్రీరాముని పేరు పెట్టిన ఈ సినిమా రామాయణంతో సంబంధముందన్న భావనతో ప్రేక్షకులు చూసే అవకాశముందని అభిప్రాయపడ్డారు. రామభక్తులను తప్పుదోవ పట్టించేవిధంగా ఈ సినిమా ఉందని ఆరోపించారు. రామ్లీలా సినిమా పేరు మార్చాలని పిటిషన్లో కోరారు. ఈ నెల 15 దేశవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.
అంతకుముందు ఈ సినిమాపై ఓ స్వచ్ఛంద సంస్థ వేసిన దావాను ఢిల్లీ హైకోర్టు వేసిన సంగతి తెలిసిందే. మరోవైపు సంజయ్ లీలా బన్సాలీ, రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనేలపై పంజాబ్లో ఎఫ్ఐఆర్ నమోదమయింది. దీంతో వీరు పంజాబ్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై 14లోగా వివరణ ఇవ్వాలని పంజాబ్ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసు జారీచేసింది.