
నిడో తానియం మృతిపై 'సిట్' దర్యాప్తు
దేశ రాజధానిలో అరుణాచల్ ప్రదేశ్కు చెందిన విద్యార్థి నిడో తానియం (19) మృతిపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఆ దర్యాప్తు బృందాన్ని సౌత్ ఈస్ట్ డీసీపీ పి.కరుణాకరన్ పర్యవేక్షించనున్నారని తెలిపారు. అయితే ఆ కేసుకు సంబంధించి ఆరుగురు నిందితులను గుర్తించామని, వారిలో ముగ్గురిని ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు. మిగిలిన నిందితుల కోసం హర్యానా, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలలో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు వివరించారు.
గత బుధవారం లజ్పత్ నగర్లోని స్వీట్ షాప్లో నిడో తానియంపై దాడి జరిగింది. ఆ మరునాడు అతడు మరణించాడు. దాంతో నిడో తానియం మృతిపై విచారణ జరపాలని హస్తినలోని జంతర్ మంతర్ వద్ద ఈశాన్యరాష్ట్రవాసులతోపాటు స్థానికులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆందోళనకారులను పరామర్శించారు. ఆ ఘటనపై పూర్తి విచారణ జరిపిస్తామని ఆందోళనకారులకు ఆయన హామీ ఇచ్చారు.
రాహుల్ అక్కడి నుంచి వెళ్లిన గంటకే సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసుల ప్రకటించడం గమనార్హం. నిడోతానియం మృతిపై నిరసనకు దిగిన ఆందోళనకారులకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మద్దతు ప్రకటించారు. నిడో తానియం మృతిపై విచారణ వేగవంతం చేయాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. నిడో తానియం మృతిపై మంగళవారం న్యూఢిల్లీలో జరిగే ధర్నాలో కేజ్రీవాల్ పాల్గొనున్నారు.