* హైకోర్టులో హెచ్‌సీయూ విద్యార్థుల పిటిషన్
* సస్పెన్షన్ రాజ్యాంగ విరుద్ధం
సాక్షి, హైదరాబాద్: తమను హాస్టళ్ల నుంచి సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) రిజిస్ట్రార్ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ దొంత ప్రశాంత్‌తోపాటు పలువురు పీహెచ్‌డీ విద్యార్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సిఫారసుల మేరకు వైస్‌చాన్స్‌లర్ ఆమోదంతో రిజిస్ట్రార్ జారీచేసిన ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని... ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్ట నిబంధనలకు సైతం విరుద్ధమని పేర్కొన్నారు.
హాస్టళ్లలో ఉంటూ తమ చదువును పూర్తిచేసే అవకాశం కల్పించాలని కోరారు. హాస్టళ్లతో పాటు పరిపాలనా భవనం, ఇతర ఉమ్మడి ప్రదేశాల్లో సంచరించేందుకు, విద్యార్థి సం ఘం ఎన్నికల్లో పోటీచేసేందుకు అనుమతివ్వాలని కోరారు.
జస్టిస్ సంజయ్‌కుమార్ వద్దకు..: ఈ వ్యాజ్యంపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావుకు పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది బొజ్జా తారకం విజ్ఞప్తి చేశారు. అయితే హెచ్‌సీయూ వివాదంలో కేంద్ర బిందువైన విద్యార్థి సుశీల్‌కుమార్‌కు తగిన రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలంటూ అతడి తల్లి వినయ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ సంజయ్‌కుమార్ విచారిస్తున్నారు. దీంతో అదే అంశానికి సంబంధించిన ఈ వ్యాజ్యాన్ని కూడా ఆ పిటిషన్‌తో కలిపి విచారించడం మేలని... అది వేరే న్యాయమూర్తి ముందు ఉన్నందున దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం తీసుకుంటారని జస్టిస్ రామచంద్రరావు స్పష్టం చేశారు.
దీంతో హైకోర్టు రిజిస్ట్రీ వర్గాలు సంబంధిత ఫైల్‌ను తాత్కాలిక సీజే జస్టిస్ దిలీప్ బి.బొసాలే ముందుకు తీసుకెళ్లగా... విద్యార్థుల వ్యాజ్యాన్ని జస్టిస్ సంజయ్‌కుమార్‌కే కేటాయించారు. సుశీల్‌కుమార్ తల్లి వినయ దాఖలు చేసిన పిటిషన్ ఈ నెల 25న విచారణకు రానుంది. ఈ లెక్కన దొంత ప్రశాంత్ తదితరులు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కూడా అదేరోజున విచారించే అవకాశముంది. తమ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని ప్రశాంత్ తదితరుల తరఫు న్యాయవాది బుధవారం న్యాయమూర్తిని కోరితే... ఆయన తీసుకునే నిర్ణయం ఆధారంగా కేసు విచారణ ఉంటుంది. బీజేపీ నేతలు తమను జాతి వ్యతిరేకులుగా అభివర్ణిస్తూ చర్యలు తీసుకోవాల్సిందిగా వీసీపై ఒత్తిడి తెచ్చారని దొంత ప్రశాంత్ తదితరులు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు.
హాస్టళ్ల నుంచి మాత్రమే పంపేశాం
ముంబై పేలుళ్ల కేసు దోషి యాకుబ్ ఉరితీతను నిరసిస్తూ ఏఎస్‌ఏ విద్యార్థులు చేపట్టిన కార్యక్రమంపై సుశీల్‌కుమార్ ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర సందేశం పోస్ట్ చేశారని... అదే వివాదానికి కారణమైందని హెచ్‌సీయూ రిజిస్ట్రార్ హైకోర్టుకు నివేదించారు. ఈవివాదంలో ఏఎస్‌ఏకు చెందిన ఐదు గురిని తొలుత వర్సిటీ నుంచి సస్పెండ్ చేశామ న్నారు. కానీ వారి భవిష్యత్తు, ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సస్పెన్షన్‌ను రద్దు చేశామని, హాస్టల్ నుంచి మాత్రమే పంపేశామని చెప్పారు. సుశీల్‌కు రక్షణ కల్పించాలంటూ అతని తల్లి విన య దాఖలు చేసిన పిటిషన్‌లో హైకోర్టు ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ కౌంటర్ దాఖలు చేశారు.
మా సస్పెన్షన్‌ను రద్దు చేయండి
Published Wed, Jan 20 2016 4:18 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement
Advertisement