పెద్ద నోట్ల రద్దే అస్త్రంగా విపక్షాలు
Published Mon, Nov 14 2016 12:10 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న సంచలన నిర్ణయం పెద్దనోట్ల రద్దు ఈసారి పార్లమెంట్ సమావేశాలను కుదిపేయనుంది. ఈ అంశంపై మోదీప్రభుత్వాన్ని ఉతికేయడానికి విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఈ నెల 16 నుంచి జరుగనున్న పార్లమెంట్ సమావేశాల్లో విపక్షాలు పెద్ద నోట్ల రద్దు అంశాన్ని తమ అస్త్రంగా మార్చుకుంటున్నాయి. దీంతో ఈ సారి ఉభయసభలు దద్దరిల్లనున్నట్టు తెలుస్తోంది. మోదీ ప్రభుత్వం ఆకస్మాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై విపక్ష పార్టీలు ఫోకస్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) లీడర్లు నేడు భేటీ కానున్నాయి. ఈ భేటీలో బీజేపీ పాలిత ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహాలను చర్చించనున్నాయి.
సమావేశాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మోదీ ప్రభుత్వాన్ని ఎలా నిలదీయాలో కూడా నిర్ణయించనున్నట్టు తెలుస్తోంది. రాజ్యసభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్, లోక్సభలో కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున ఖార్గే, లోక్సభలోని తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు సుదీప్ బందోపాధ్యాయతో భేటీ కానున్నారు. ఈ భేటీ, లోక్సభ స్పీకర్ సుమిత్రా నిర్వహించనున్న ఆల్ పార్టీ మీటింగ్ కంటే ముందే జరుగునుందని విపక్ష నేతల సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు పెద్దనోట్ల రద్దును పలువురు ప్రశంసిస్తుండగా.. పలువురు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ముందస్తు జాగ్రత్తలు ఏమీ తీసుకోకుండా పెద్ద నోట్లను రద్దుచేశారని, దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కొందరు పేర్కొంటున్నారు. ఈ చర్యతో దేశాన్ని పట్టిపీడిస్తున్న అవినీతి, నకిలీ నోట్లను నిర్మూలించి నల్లధనాన్ని బయటకు రాబట్టవచ్చని మరికొందరు కొనియాడుతున్నారు.
Advertisement