ఆ దేవుళ్లకు ఉల్లిపాయలే కానుకలు
జైపూర్ : నిత్యవసర వస్తువులైన ఉల్లిపాయలు, పప్పులు ధరలు రోజురోజుకు రాకెట్ స్పీడ్తో ఆకాశంలోకి దూసుకుపోతున్నాయి. అయినా ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టిన ఆ ధరలను మాత్రం నియంత్రించలేకపోతుంది. కానీ వాటి ధర ఎంత పెరిగినా లెక్కచేయకుండా కొంగు బంగారంగా కొలిచే ఆ దేవుళ్లకు మాత్రం భక్తులు తమ భక్తి ప్రపత్తులతో ఉల్లిపాయలు, పప్పులు చెల్లించుకుంటున్నారు. ఈ ఆచారం రాజస్థాన్ హనుమాన్గఢ్ జిల్లా గోమేధి గ్రామంలో కొలువు తీరిన గొగాజీ, గురు గోరఖ్నాథ్ దేవాలయాల్లో ఆచారంగా కొనసాగుతుంది. అదీ ఒక్క భాద్రపథమాసంలోనే భక్తులు ఇలా దేవుళ్లకి సమర్పిస్తారని ఆలయ అధికారులు శనివారం వెల్లడించారు.
ఈ మాసంలో ఈశాన్య రాష్ట్రాలతోపాటు హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ నుంచి దాదాపు 40 లక్షల మంది భక్తులు ఈ దేవుళ్లను దర్శించుకుంటారని చెప్పారు. పావు కేజీ ఉల్లిపాయలు, పప్పులు చెల్లించి తమ కోర్కెలు తీర్చమని భక్తులు కోరతారని తెలిపారు. ఈ ఒక్క మాసంలో దాదాపు 50 నుంచి 70 క్వింటాళ్ల ఉల్లిపాయలు దేవుడికి భక్తులు కానుకగా సమర్పించుకుంటారని పేర్కొన్నారు. అయితే అలా వచ్చిన ఉల్లిపాయలను మార్కెట్లో విక్రయించి.. వచ్చిన నగదు గురు గోరఖ్నాథ్ దేవాలయం నిర్వహణతోపాటు గోశాలలోని గోవులకు ఆహారం సమకూరుస్తామని తెలిపారు.